Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అమృత - ప్రణయ్' ప్రేమకథ ఆధారంగా వర్మ చిత్రం - విరుచుకుపడిన అమృత (video)

'అమృత - ప్రణయ్' ప్రేమకథ ఆధారంగా వర్మ చిత్రం - విరుచుకుపడిన అమృత (video)
, సోమవారం, 22 జూన్ 2020 (08:10 IST)
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద అంశంలోకి తలదూర్చాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పైగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆర్జీవీ ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. 
 
నిజానికి లాక్డౌన్ రోజుల్లోనే 'కరోనా' పేరుతో సినిమా తీసిన వర్మ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేశారు. తాజాగా అమృత - ప్రణయ్ ప్రేమ కథ, ప్రణయ్ హత్య, అమృత తండ్రి మారుతీ రావుల కథను ఆధారంగా చేసుకుని సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి 'మర్డర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అంతేకాదు, కుటుంబ కథా చిత్రమ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. 
 
 
మరోవైపు, ఆర్జీవీ మర్డర్ చిత్రం టైటిల్‌, ఫస్ట్ లుక్‌పై ప్రణయ్ భార్య అమృత తీవ్రంగా స్పందించారు. యథార్థ కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ ఈసారి ప్రణయ్, అమృతల ప్రేమ వ్యవహారం, కిరాయి మూకలతో మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తన కథ ఆధారంగా వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమాపై అమృత భావోద్వేగంగా స్పందించారు.
 
వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అమృత అన్నారు. ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తప్పా? అని ప్రశ్నించారు. 
 
ఈ ఒక్క ఘటన వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న సమయంలో రాంగోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడిందని, అయితే, దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని, ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని అన్నారు.
webdunia
 
రాంగోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోయినట్టు చెప్పారు. కొడుకుతో కలిసి ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పెట్టొద్దని వేడుకున్నారు. తమ పేర్లను ఉపయోగించి వర్మ తప్పుడు కథను అమ్ముకోవాలని చూస్తున్నాడని అన్నారు. 
 
మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తోందని అన్నారు. తన కథ ఆధారంగా సినిమా తీస్తున్న వర్మపై కేసు వేయడం లేదని, ఎందుకంటే ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడేనని అన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదని పేర్కొన్న అమృత చివర్లో 'రెస్ట్ ఇన్ పీస్' అంటూ అమృత ముగించింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా నాన్న నవ్వు... నా బిడ్డ చిరునవ్వు.. రెండూ నాకు చాలా ఇష్టం