టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగళవారం రాత్రి మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ తండ్రిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త ఎంతో బాధించిందన్నారు. చవరిసారిగా ఆయనను వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సెట్‌లో కలిశానని గుర్తుచేశారు. తండ్రిని కోల్పోయి కష్ట సమయంలో ఉన్న రవితేజ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అలాగే, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. "రవితేజ తండ్రి శ్రీ రాజగోపాల రాజు గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. రాజగోపాల రాజు గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రవితేజకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని పేర్కొన్నారు.
హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి భౌతికంగా దూరమయ్యారు. ఆయన వయసు 90 యేళ్లు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు.
ఆయన వృత్తిరీత్యా పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు రవితేజ కాగా మరొకరు రఘు, అలాగే భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గంపేట.
ఉద్యోగ రీత్యా ఆయన అనేక ప్రాంతాలలో పనిచేస్తూ వచ్చారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు. తండ్రి మృతితో రవితేజ దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రవితేజ నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తూ సంతాపం తెలుపుతున్నారు.