మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రంతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్. ఈయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. అదేసమయంలో త్వరలో "మహర్షి" సినిమాతో హీరో మహేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మహేష్ 26వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రూపొందించనుంది. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన సుక్కూ 2019లో మూవీ విడుదల చేయనున్నాడట. సంగీత దర్శకుడిగా మరోసారి తన సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.
గతంలో మహేశ్ - సుక్కు కాంబినేషన్‌లో '1 నేనొక్కడినే' అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం అంతగా ప్రేక్షకులని అలరించలేకపోయింది. అయితే వీరిద్దరి తాజా ప్రాజెక్ట్ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన సంఘటనలతో ఉంటుందని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో టీం ఉంది.
అయితే ఇందులో కథానాయికలుగా సుకుమార్ ఇద్దరు భామలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాని, 'గీత గోవిందం' భామ రష్మిక మందన్న చిత్రంలో మహేష్‌తో జతకట్టనున్నారట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి చిత్రంతో బిజీగా ఉండగా, కొద్ది రోజులలో ఈ చిత్రం యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ షెడ్యూల్‌కి సిద్దమవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, మహేష్... సుకుమార్ ప్రాజెక్టులో నటించనున్నాడు.