ఇప్పుడు కరోనా పరిస్థితి వల్ల చాలామంది ఓటీటీలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆహా! పేరుతో అల్లు అరవింద్ ప్రవేశించారు. మరో నిర్మాత తుమ్మల రామసత్యనారాయణ ఊర్వరి పేరుతో వచ్చేశారు. మరో ఇద్దరు దర్శకుడు కూడా ఓటీటీలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రామ్‌గోపాల్ వర్మ `స్పార్క్` అనే ఓటీటీలోకి ప్రవేశించారు. ఇందుకు పూరీ జగన్నాథ్‌తోపాటు ప్రభాస్, రాజమౌళిలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
బ్రాండ్ న్యూ ఓటిటి 'స్పార్క్' ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది. 'స్పార్క్' యూకే ఆధారిత ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక యూనిట్. ఇప్పుడు భారతీయ ఓటిటి మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు 'స్పార్క్'ను భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని కంటెంట్‌ను అందించనున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు 'స్పార్క్' నిర్వాహకులు. సాగర్ మాచనూరు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' సహకారంతో 'స్పార్క్' ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేశారు. ఆర్జీవీ నుండి వచ్చే అన్ని సినిమాలు ప్రత్యేకంగా 'స్పార్క్' ఓటిటిలో విడుదల కానున్నాయి. ఆర్‌జివి డ్రీమ్ ప్రాజెక్ట్ 'డి కంపెనీ' మే 15 నుండి 'స్పార్క్'లో ప్రసారం అవుతుంది.