Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఇప్పుడు మీరు విద్యార్థులు కారు, మీరే గురువులు.. ఇప్పుడు నేనే మీ అభిమానిని' : కమల్ హాసన్

తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం గత ఐదు రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విద్యార్థులను, యువతను తమిళ హీరో కమల్ హాసన్ అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'ఇప్పుడు మీరు విద్యార్థులు కారు, మీ

'ఇప్పుడు మీరు విద్యార్థులు కారు, మీరే గురువులు.. ఇప్పుడు నేనే మీ అభిమానిని' : కమల్ హాసన్
, శనివారం, 21 జనవరి 2017 (13:43 IST)
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం గత ఐదు రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విద్యార్థులను, యువతను తమిళ హీరో కమల్ హాసన్ అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'ఇప్పుడు మీరు విద్యార్థులు కారు, మీరే గురువులు.. ఇప్పుడు నేనే మీ అభిమానిని..' అంటూ పేర్కొన్నారు. 
 
జల్లికట్టు కోసం మెరీనా బీచ్‌లో శాంతియుత ఆందోళన చేస్తున్న విద్యార్థులనుద్దేశించి కమల్‌ హాసన్‌ శనివారం వరస ట్వీట్లు చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదలను ప్రశంసించిన ఆయన ఇలాగే అహింసాయుతంగా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. 'ఇది ప్రజల ఉద్యమం. సెలబ్రిటీలు కేవలం వాళ్లకు మద్దతు మాత్రమే ఇవ్వాలి కానీ అక్కడికి వెళ్లి అందరి దృష్టీ తమ మీద పడేలా చేసుకోవడాన్ని నేను అంగీకరించను..' అని కమల్‌ పేర్కొన్నారు. 
 
'ప్రపంచం మనల్ని చూస్తోంది, తమిళులు భారతదేశం గర్వపడేలా చేస్తున్నారు' అని కమల్‌ పేర్కొన్నారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమానికి మ్యానిఫెస్టో మద్రాసులోనే రూపొందించారని, దాన్ని 2017లో తమిళనాడులో విజయవంతంగా ఆచరిస్తున్నారని కమల్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పార్టీకీ ఒక్కో టీవీ ఛానల్‌ ఉందని, వార్తల్లో పక్షపాతం కన్పిస్తుందని, అవేవీ పట్టించుకోకుండా లక్ష్యసాధనే ఆశయంగా ముందుకు సాగాలని, తప్పక విజయం సాధిస్తారని కమల్‌ ట్వీట్‌ చేశారు.
 
కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనాబీచ్‌కు చేరుకున్న జల్లికట్టు మద్దతుదారులు, విద్యార్థులు శాంతియుత మార్గంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో ట్వీట్లు చేయగా.. మరికొందరు మెరీనా బీచ్‌కి వెళ్లి నిరసనలో పాల్గొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మకీ.. మనిషికి తేడా తెలియని వ్యక్తి ఆయన... జైరా స్పందనకు ఉలిక్కిడిన కేంద్రమంత్రి