తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రి నుంచి బయలుదేరి చెన్నైకు బయలుదేరారు. ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చేరారు. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఉదయం చికిత్స నిమిత్తం రజనీకాంత్ జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. మూడురోజుల పాటు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. రజనీకాంత్ వెంట ఆయన కూతురు ఉండి బాగోగులు చూసింది.
ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలుదేరారు.
ప్రస్తుత రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఒత్తిడికి గురికాకుండా కొద్దిగా వ్యాయామం చేయాలని చెప్పారు. అన్ని వైద్య పరీక్షల నివేదికలు అందడంతో క్షుణ్ణంగా పరిశీలించి వైద్యులు ఆయనకు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించిన అనంతరం డిశ్చార్జి చేశారు.
కాగా, రజనీకాంత్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎవరిని ఆసుపత్రి వర్గాలు లోపలికి అనుమతించలేదు. ఆసుపత్రి ఎదుట కొందరు అభిమానులు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ తమ అభిమాన నటుడు కోలుకోవాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక పూజలు జరిపారు.