అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఐకాన్‌స్టార్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లొ వున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహకులు. దీంతో పుష్ప ది రైజ్‌కు దక్కిన అరుదైన గౌరవంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందంలో వున్నారు.