Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం.. తప్పు జరిగిపోయిందంటున్న ప్రకాష్ రాజ్

Advertiesment
MAA Election
, శనివారం, 9 అక్టోబరు 2021 (18:52 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ కోసం బంజారా హిల్స్‌లోని పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
 
ఈ నేపథ్యంలో, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, పోస్టల్ బ్యాలెట్ అంశంలో తప్పు జరిగిపోయిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల అధికారి కూడా తప్పుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. 
 
దేశంలో న్యాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచివాళ్లు పోటీ చేయలేకపోతున్నారని ఆక్రోశించారు. రేపటి పోలింగ్ గురించి చెబుతూ, ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.
 
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో మా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న జీవిత మాట్లాడుతూ, ఎవరికి ఓటు వేయాలన్నదానిపై మా సభ్యుల్లో స్పష్టత ఉందన్నారు. 
 
నాగబాబు చెప్పిన అన్ని విషయాలు వాస్తవమేనని అన్నారు. రాజకీయాలు అన్నీ ఒకేలా ఉంటాయని జీవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రాల రాజకీయాలు, మా రాజకీయాలకు తేడా కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు.
 
మరోవైపు, మా సభ్యులకు మోహన్ బాబు ఆడియో సందేశం పంపారు. నాడు తెలుగు కళాకారులు ఒకటిగా ఉండాలనే 'మా' ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఎన్నికలతో పనిలేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సినీ పెద్దలు భావించేవారని పేర్కొన్నారు. 
 
అయితే కొందరు 'మా' సభ్యులు అనవసరంగా నవ్వులపాలవుతున్నారని వివరించారు. 'మా' ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు ఎంతో బాధ కలుగుతోందని తెలిపారు. ఎవరు ఎలాగున్నా, ఎవరు ఏం చేసినా 'మా' ఓ కుటుంబం అని మోహన్ బాబు స్పష్టం చేశారు.
 
"విష్ణును మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఓటేయండి. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించండి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని విష్ణు నెరవేర్చుతాడని నమ్ముతున్నాను. విష్ణు విజయం సాధించాక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలను వారికి విన్నవించుకుందాం" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే- కు గుమ్మ‌డికాయ కొట్టేశారు