రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద తండ్రి కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన పుట్టిన ఊరైన మొగల్తూర్‌లో చేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కృష్ణంరాజుగారి 11వరోజు కార్యక్రమం నిర్వహించి పలువురికి జ్ఞాపికంగా గిఫ్ట్ అందజేశారు. అయితే కృష్ణంరాజు స్వంత ఊరిలోనూ ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, అభిమానుల కోరిక మేరకు ఈనెల 29వ తేదీన సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు 8 ఎకరాల కొబ్బరితోటను వేదికగా చేసుకున్నారు. అక్కడ సభ, భోజన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
ఈనెల సెప్టెంబర్ 28, 29 రెండురోజులు ప్రభాస్ అక్కడే వుంటారు. మొగల్తూరులో రాజులు పరిపాలించిన కోట వారిదే. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల ప్రజలు అక్కడికి రానున్నారు. దాదాపు 70 గ్రామాల ప్రజలు సంస్మరణ సభలో పాల్గొననున్నారు. కృష్ణంరాజుపై అభిమానంతో ఇప్పటికే 70 గ్రామాలలోని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి పిల్లలు, ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాజుల సంప్రదాయం ప్రకారం ఈ సభలో భోజనాలు నాన్‌వేజ్ పెట్టనున్నారు. అందుకే ఎటువంటి తప్పిదాలు జరగకుండా భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది.
భోజనాల ఏర్పాట్లను ప్రభాస్ కుటుంబీకులు, సోదరులు చూసుకుంటున్నారు. మామూలుగానే కృష్ణంరాజుగారి భోజనం పెడితే మాంసాహారంలోని అన్ని ఐటమ్స్ వడ్డిస్తారు. రొయ్యలు, పీతలు, చేపలు, నాటుకోడి మాసం, మేక మాంసం వంటివి కృష్ణంరాజుగారే స్వయంగా వడ్డించేవారు. కాగా, ఇప్పటికే పోలీసు యంత్రాంగం మొగల్తూరులో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.