Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఆర్ఆర్ఆర్" అడుగడుగునా అడ్డంకులే... హైకోర్టులో పిల్

Advertiesment
, గురువారం, 6 జనవరి 2022 (08:58 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. దీంతో అనేక రాష్ట్రాల్లో రాత్రికర్ఫ్యూలు, వారాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్‌లు అమలు చేస్తూ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడంది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను అవమానపరిచేలా, వారి అనుచరుల మనోభావాలను దెబ్బతీసేలా, ఈ సినిమాలో ఉద్దేశపూర్వకంగా నిజమైన వీరుల చరిత్రను చిత్రం బృందం వక్రీకరించిందని పేర్కొన్నారు. 
 
అందువల్ల ఈ చిత్రాన్ని విడుదలకాకుండా స్టే ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ జస్టిస్ ఉజ్జల్ భయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై ఈ ధర్మాసనం త్వరలోనే విచారణ జరుపనుంది. కాగా, ఈ చిత్రం కేవలం కల్పిత కథతో తెరకెక్కించామని, వారి నిజజీవితంతో సంబంధం లేదని దర్శకుడు రాజమౌళి పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూ ఇయ‌ర్ డాన్స్ అద‌ర‌కొట్టిన స‌న్నీ లియోన్‌