ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ.. ఓ సినిమాలో తను స్వరపరిచిన బాణీలు ఇప్పటికీ ఆయనపై ఈనాటి సినీప్రపంచం అనురాగం చూపిస్తూనే వుంటుంది. ఎ.ఆర్. రెహమాన్ సినిమాకు పరిచయం కానప్పటినుంచీ ఏ భాషలో చూసినా ఇళయరాజా సంగీతమే వినపొంపుగా వినిపించేది. అందుకే ఆయనను స్వరరాజు అని పిలుచుకుంటారు. ఆయన జన్మదినం నేడే. పన్నైపురంలో
జూన్ 2, 1943లో జన్మించారు. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలోని ఒక పంచాయతీ పట్టణం ఇది. సరిహద్దు కేరళ. ఆయన ఇప్పటికీ అన్ని బాషల్లో 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తే, ఐదువేల పాటలకు స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయనకు సినీసంగీత దర్శకులు శుభాకాంక్షలు తెలిపారు. మ్యూజికల్ బర్త్‌డే ఈరోజు అంటూ దేవీశ్రీప్రసాద్ ట్వీట్ చేశాడు.
ఇళయరాజా సంగీతదర్శకుడేకాదు. పాటల రచయిత, గాయకుడు కూడా. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులుగా నిలిచారు. శాస్గ్రీయ సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని జోడించి కొత్త ప్రయోగాలు చేశారు. సంగీతంలో లయబద్ధ విన్యాసాలతో రకరకాల ప్రయోగాలు చేశారు. వాటితో విశిష్టమై బాణీలు అందించారు.
కమల్‌హాసన్, జయప్రధ నటించిన సాంగరసంగమంలో `నాదవినోదం నాట్య విలాసం. పరమ సుఖం.. అభినయవేదం.సభకు అనువాదం.. అంటూ ఆయన నుంచి వచ్చిన బాణీలు అపురూపం. ఇళయరాజాకు ఓ బ్రాండ్ వుండేది. అది ఏ సినిమా అయినా కావచ్చు ఆయన బాణీఅని ఇట్టే చెప్పేయవచ్చు. మాస్ పాటైనా, మెలోడీ పాట అయినా సంగీతాన్ని సమకూర్చి వన్నె తెచ్చేవారు. దక్షిణాదిలో అన్ని భాషాలతోపాటు మరాఠీలోనూ ఆయన సంగీతం చేశారు. `మాటే మంత్రమూ, మనసే బంధం. ఈ మనసే ఈ సమతే . మంగలవాద్యం, ఇది కళ్యాణం, కమనీయం జీవితం, అంటూ హాయిగొలిపే సాహిత్యానికి తనదైన బాణీలు కూర్చారు. అందుకే ఆయన స్వరరాగ ప్రవాహంలో మునిగిన ఈ తరం సైతం ఆయన బాణీలు వింటూ మైమరుస్తుంటారు. ట్యూన్ రిథమ్‌లోనూ తనదైన ముద్ర వేసేవారు.
హీరోలకు ధీటుగా కటౌట్లు
పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలేకుండా సంగీతం సమకూర్చి సంగీతభరిత సినిమాగా పైకి తీసుకు వచ్చేవారు. సంగీత ప్రపంచంలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. హీరోలకు ధీటుగా ఆయన కటౌట్లు పెట్టిన సందర్భాలూ వున్నాయి. రజనీకాంత్ `దళపతి`లో `చిలకమ్మ. చిటికెయ్యంగా, అనే పాట ఇప్పటికీ అలరిస్తుంది. 1980లో అయితే ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునేవారు అభిమానులు. చిరంజీవి, కోదండరామిరెడ్డి చేసిన దాదాపు అన్ని సినిమాలకూ ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. ఎ.ఆర్. రెహమాన్ వచ్చేవరకు ఆయన బాణీలు ఎంతో క్రేజ్ సంపాదించాయి. గీతాంజలిలోని పాట ఇప్పటీకీ ఎవర్‌గ్రీన్.
40 ఏళ్ళ వృత్తి జీవితంలో ఆయనకు ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. 1993లో లండన్‌లోని రాయల్ ఫిలాక్‌మేడీని ఆర్కెస్ట్రాకు పూర్తిస్థాయి సింఫనీని కంపోజ్ చేసిన ఘనత ఆయనదే. ఆసియాలోనే అది తొలి రికార్డ్. అందుకే భారత ప్రభుత్వం సినీరంగానికి ఆయన చేసిన సేవలకు 2010లో పద్మభూషన్, 2018లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 20వ దశకంలో వస్తున్న కొత్తతరం ఆయన వారసులనే చెప్పాలి. అందుకే కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఆయన కాస్తదూరంగా వుంటున్నారు. ఆయన వారసుడు యువన్ శంకర్‌రాజా. ఎప్పుడూ సైలెంట్‌గా వుండే ఆయన రికార్డింగ్ థియేటర్లలో ఎదుటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తుంటారు. ఆయన గొప్ప ఆధ్యాత్మిక వేత్తకూడా. రజనీతో కలిస్తే ఎక్కువ ఇవే విషయాలు చర్చకు వస్తాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.