ఆకాశం హద్దురా ఫేమ్ సూర్య ఇటీవలి సినిమా కంగువ ఆస్కార్ నామినేషన్‌కు పంపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 323 చిత్రాలలో ఆస్కార్ అవార్డులకు ఉత్తమ చిత్రంగా నామినేట్ కావడానికి అర్హత కలిగిన చిత్రాల జాబితాలో కంగువా ఉంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపాలని ధైర్యం చేశారు. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత కూడా ఈ సినిమాలోని భయంకరమైన సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడంతో కంగువా వార్తల్లో నిలిచింది.
ఇంకా ఓటీటీలో ఈ సినిమా విడుదల కావడం ఈ సినిమాకు మంచి హైప్ పెంచింది. బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోయినా అవార్డులకు వెళ్లే అర్హత ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ వరుసలోనైనా కంగువ నిలుస్తుందని ఆ చిత్ర దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఇకపోతే.. 97వ అకాడమీ అవార్డులకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులకు అర్హత కలిగిన 323 చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మక ఉత్తమ చిత్ర అవార్డు కోసం పోటీ పడుతున్నాయి.
పోటీదారులలో, ఆరు భారతీయ చిత్రాలు రేసులోకి ప్రవేశించాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉత్తమ చిత్ర విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రాలు కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లీష్). ముఖ్యంగా, బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విఫలమైన కంగువాను చేర్చడం విమర్శలకు దారితీసింది.
ఆస్కార్ నామినేషన్ల కోసం ఓటింగ్ బుధవారం అంటే జనవరి 8న ప్రారంభమై జనవరి 12న ముగుస్తుంది. ఇక అకాడమీ జనవరి 17న తుది నామినేషన్లను ప్రకటిస్తుంది. ఈ ఐదు చిత్రాలలో ఏవైనా నామినేషన్ పొందుతాయో లేదో చూడటానికి భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 2, 2025న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.