Suhas - Malvika Manoj - Anita
కథానాయకుడు సుహాస్ చేస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఓ భామ అయ్యో రామ. మాళవిక మనోజ్ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ చిత్రీకరణ పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యాయి. విఆర్ట్స్అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గోదాల దర్శకుడు.
హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. దర్శకుడు వశిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో దర్శకుడు కొలను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. టైటిల్ పోస్టర్‌ను దర్శకులు విజయ్ కనకమేడల,కిషోర్ తిరుమల, నిర్మాత సుదర్శన్ రెడ్డి, ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు దర్శకుడితో పరిచయం వుంది. మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నా అభిమాన నటులతో నటించే అవకాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళదామా అని ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నువ్వునేను ఫేం అనితా హస్సానందని మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫర్ ఫెక్ట్‌గా కుదిరిన చిత్రమిది. నన్ను ఎంతగానో ఆకర్షించిన కథ ఇది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్తగా దర్శకత్వం చేసే వాళ్లకు దొరికిన వరం. ఎంతో కంఫర్టబుల్ ఆర్టిస్ట్. చాలా వైవిధ్యమైన కథలతో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ సినిమా చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మంచి టెక్నిషియన్స్‌ను ఇచ్చాడు. రథన్ సంగీతం చిత్రానికి అదనపు బలంగా వుంటుంది అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ దర్శకుడు రాసుకున్న కథకు తగిన విధంగా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కుదిరారు. అంతా ఫ్రెండ్లి వాతావరణంలో ఈసినిమా చేస్తున్నాం. సినిమా ప్రారంభం నుంచే మంచి పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ హాస్యనటుడు అలీ, సినిమాటోగ్రాఫర్ మణికందన్, సంగీత దర్శకుడు రథన్, ఆర్ట్ దర్శకుడు బ్రహ్మా కడలి, కో ప్రొడ్యూసర్ ఆనంద్ గడగోని తదితరులు పాల్గొన్నారు.