తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్, వ్యాపారి నిఖిల్ జైన్‌ల వివాహం చట్టబద్ధంగా చెల్లదు అని కోల్‌కతా న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. టర్కీలోని బోడ్రమ్‌లో గత 2019 సంవత్సరం జూన్ 19వ తేదీన వారి మధ్య జరిగినట్టుగా చెబుతున్న వివాహం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది.
విభేదాల నేపథ్యంలో తమ వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ నిఖిల్ జైన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోనందున, వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగణించలేమని జడ్జి తీర్పునిచ్చారు.
కాగా, టర్కీలో వివాహం చేసుకున్న వీరిద్దరూ కోల్‌కతాలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. తమ వివాహాన్ని ఇండియాలోనూ రిజిస్టర్ చేయించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా నస్రత్ అంగీకరించలేదని గతంలో నిఖిల్ ఆరోపించారు.
అదేసమయంలో నస్రత్‌కు నటుడు, మోడల్ యశ్‌దాస్ గుప్తాతో అఫైర్ ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే తమ వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిఖిల్ నిర్ణయించి కోర్టును ఆశ్రయించారు.