Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పుడు ధ్యాస నా మీదకు కాస్త మళ్ళింది - ఎస్పీ చరణ్

SP Charan
, మంగళవారం, 12 జులై 2022 (15:49 IST)
SP Charan
దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతా రామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఓహ్ సీతా, ఇంతందం ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఈ రెండు పాటలని అద్భుతంగా ఆలపించారు. ఆయన వాయిస్ సంగీత ప్రియులని మెస్మరైజ్ చేస్తోంది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఎస్పీ చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి.
 
పాటలు వింటుంటే సడన్‌గా బాలు గారే పాడినట్లనిపిస్తుంది. అలా పాడమని దర్శక నిర్మాతలు ఏమైనా చెప్పారా ?
నేను ఇండస్ట్రీ కి వచ్చి 25 ఏళ్లపైనే అవుతుంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఇలానే పాడాను. అయితే ఇప్పుడు వినేవాళ్ళ ధ్యాస నా మీదకు కాస్త మళ్ళిందేమో.  ఇంతకుముందు పాడినప్పుడు కూడా నాన్నగారి చిన్నప్పటి వాయిస్ లా వుందే అనేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వలన నామీద కాస్త ధ్యాస ఏర్పడిందేమో కానీ ప్రత్యేకించి నాన్నగారిలా పడాలనే ఉద్దేశం కాదు.
 
కేవలం బాలు గారే పాడదగ్గ పాటలు కొన్ని వుంటాయి.. అలాంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తున్నాయని భావిస్తున్నారా ?
నేను అలా అలోచించడం లేదండీ. నాన్నగారు పాడాల్సిన పాటలు నాకే రావాలనే ఆలోచన లేదు. కానీ నాకు వచ్చే పాటలు నా శక్తి మేరకు  బాగా పాడాలనే ప్రయత్నం చేస్తాను.
 
ఈ పాటల్లో సాహిత్యం ఎలా అనిపించింది ?
కేకే గారు రాసిన పాట చాలా కొత్తగా అనిపించింది. స్వచ్చమైన తెలుగులా పాడినప్పుడు కూడా చాలా తీయగా అనిపించింది. మెలోడికి తగిన సాహిత్యం కుదిరింది.  మంచి తెలుగు రాసినందుకు కేకే గారికి మరోసారి కృతజ్ఞతలు.  
 
సంగీత దర్శకుడు  విశాల్ చంద్రశేఖర్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
సినిమా, కథ పరంగా చాలా సెన్సిబిలిటీస్ వున్న సంగీత దర్శకుడు. మెలోడి మంచి పట్టువున్న సంగీత దర్శకుడాయన. ఆయన ప్రోగ్రామింగ్ అద్భుతంగా వుంటుంది. లైవ్ మ్యూజిక్ కోసం ఆయన పడే తపన నాకు చాలా నచ్చింది. ఆయన్ని మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.
 
ఈ మధ్య అచ్చతెలుగు మెలోడి పాటలు మళ్ళీ రావడం మొదలైయింది. ఈ మార్పుని ఎలా చూస్తారు ?
 మెలోడీలు ఎప్పుడూ వున్నాయి. అయితే ఫాస్ట్ బీట్ పాటల మధ్య అవంతగా కనిపించకుండా పోతున్నాయి. ఎక్కువ కాలం నిలిచేవి మెలోడిలే. ఫాస్ట్ బీట్ పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మర్చిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకుని పాడుకునే పాటలు మెలోడిలే. రానున్న రోజుల్లో పూర్తి మెలోడి పాటలు వుండే సినిమాలు కూడా వస్తాయనే నమ్మకం వుంది.
 
ఒకప్పుడు తెలుగులో ఉదృతంగా పాడారు. తర్వాత ఒక్కసారిగా తగ్గించేశారు. నిర్మాణం వైపు వెళ్ళడం దీనికి కారణమని భావిస్తున్నారా ?
ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, ఆర్పీ పట్నాయక్.. ఇలా అందరి సంగీత దర్శకుల దగ్గర నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి. జనాదరణ పొందాయి. అయితే తర్వాత ఎందుకు అవకాశాలు కుదరలేదో నాకైతే తెలీదు. నిర్మాణంలో బిజీగా వుండటం వలన పాడలేననే మాట నేను ఎన్నడూ చెప్పలేదు.  రికార్డింగ్‌కి ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి నేను అందుబాటులో వుంటాను.
 
సంగీతంలో వచ్చిన మార్పులు గురించి ? పాట పట్ల మన అప్రోచ్ అప్పటికి ఇప్పటికి ఎలా మారింది ?
సంగీతంలో వచ్చిన మార్పులు గురించి మాట్లాడాల్సినంత పెద్ద వాడిని కాదు, నేను వచ్చే పాతికేళ్ళు అవుతుంది. ఒక సింగర్ గా పాట పట్ల నా అప్రోచ్ మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మెలోడి పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా సెన్సిబుల్ గా మంచి పరిజ్ఞానంతో వున్నారు. దర్శక నిర్మాతలు కొత్త సంగీత దర్శకులని గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం ఆనందంగా వుంది.  
 
బాలు గారు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మంది కొత్త వారిని పరిచయం చేశారు. ఇప్పుడు మీరు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా.. ఇప్పుడు వస్తున్న వారికీ ఎంత ప్రతిభ వుందని భావిస్తున్నారు ?
ప్రతిభకు కొరత లేదు. ఇప్పుడు అవకాశాలు కూడా వస్తున్నాయి. వారిని ప్రతిభని ప్రదర్శించడానికి చాలా వేదికలు దొరుకుతున్నాయి. భవిష్యత్ లో మంచి ప్రతిభ గల గాయకులు పరిశ్రమకి వస్తారని ఆశిస్తున్నాను.
 
సంగీత దర్శకత్వం వైపు ద్రుష్టి పెట్టె ఆలోచన వుందా ?
ఇప్పుడు లేదండీ. సంగీత పరంగా ఇంకా పరిణితి సాధించాని భావిస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్ నుంచి పాట.. అక్డీ పక్డీ అదుర్స్