మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రానికి కథా రచయితగా పని చేసిన యువ రచయిత వంశీ రాజేశ్ ఇకలేరు. ఆయనకు కరోనా వైరస్ సోకి కన్నుమూశారు.
రెండు వారాల క్రితం ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమలో ఆయన ఓ దశలో కోలుకుంటున్నట్టే అనిపించినా, అకస్మాత్తుగా పరిస్థితి విషమించింది. దాంతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ వంశీ రాజేశ్ తుదిశ్వాస విడిచారు.
ఈ యువ రచయిత మృతితో టాలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల స్పందిస్తూ, ఎంతో ప్రతిభ ఉన్న వంశీ రాజేశ్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. వంశీ రాజేశ్‌తో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
వంశీ రాజేశ్ 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం తర్వాత పలు చిత్రాలకు కథా విభాగంలో పనిచేశారు. దర్శకుడు అవ్వాలని కోరుకున్న వంశీ రాజేశ్ కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అంతలోనే ఇలా జరగడం బాధాకరం. కాగా, కరోనా వైరస్ బారినపడిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు కోలుకున్న విషయం తెల్సిందే.