పాపులర్ యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. ''30 రోజుల్లో ప్రేమించటం ఎలా?" అనే సినిమాలో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా సరికొత్త మైలురాయి అందుకుంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. 'నీలి నీలి ఆకాశం' పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్, అమృతా అయ్యర్‌పై చిత్రీకరించిన 'నీలి నీలి ఆకాశం' పాట 150 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.