శుక్రవారం విడుదలైన సినిమాల్లో `నాంది` సినిమా బాగుందనే టాక్ పరిశ్రమలో విస్తరించింది. తొలిరోజు రెండు తెలుగు రాష్టాలలో మంచి టాక్‌తో పేరు తెచ్చుకుంది. దాంతో నాంది టీమ్ వెంటనే సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. సినిమారంగంలో ప్రముఖులు నరేష్‌కు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తనకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లోపల దాగివున్న ఫీలింగ్ ఉద్వేగంతో బయటకు వ్యక్తం చేశాడు. వెంటనే కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. తన తండ్రిని ఒక్కసారి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మీడియా సమావేశం కూడా తన ఇంటిలోనే పెట్టడంతో తన తండ్రి ఈ సక్సెస్‌ను చూస్తాడనే ఫీలింగ్ ను కూడా వ్యక్తం చేశాడు.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నరేష్‌కు విజయం దోబూచులాడుతోంది. అందుకు ఆయన ఎంచుకున్న కథలతోపాటు కొన్ని మొహమాటానికి చేయాల్సి రావడం. అందులో బంగారు బుల్లోడు సినిమా వుంది. ఆ సినిమా గత వారంలోనే విడుదలై తిరుగుటపా కట్టింది. అందుకే ఇకపై ఆ తరహా సినిమాలకు స్వస్తి పలుకుతానంటూ కాస్త ఆలస్యమైనా మంచి కథ వున్న సినిమానే చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు నాంది సినిమా విడుదలకుముందు ప్రకటించారు. ఈ నాంది సినిమాపై ముందునుంచి నమ్మకంతో వున్నాడు. ఆయన అనుకున్నట్లుగానే సక్సెస్ అయింది. 2012లో వచ్చిన సుడిగాడు తన చివరి పెద్ద హిట్ మూవీ అని, ఆ తర్వాత తనకు అంతటి విజయం నాందినే అని చెప్పాడు. తన రెండో ఇన్నింగ్స్‌కు దర్శకుడు విజయ్ కనకమేడల నాంది పలికాడని ఉద్వేగంతో చెప్పాడు.