కొత్తల్లో నా గొంతు బాలేదని అనేవారు.... నాగార్జున
నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రంలో నాగార
నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 8న ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకోనుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం వినాయకచవితి సందర్భంగా కింగ్ నాగార్జున పాత్రికేయుల సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు....
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ '''నిర్మలా కాన్వెంట్' ప్యూర్, ఫ్రెష్ లవ్‌స్టోరీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ కథా చిత్రాలు రావడం లేదు. కథ వినగానే నాకు బాగా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిన లవ్‌స్టోరీ. కథ విన్న తర్వాత రోషన్ ఫోటోలు చూశాను. తనైతే ఈ పాత్రకు యాప్ట్ అవుతాడనిపించింది. అలాగే హీరోయిన్ శ్రేయా శర్మ కూడా క్యూట్‌గా కనపడుతుంది. ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనపడతాను. ఇంటర్వెల్ నుండి ఎండింగ్ సీన్ వరకు నా పాత్ర ఉంటుంది. ఇక హీరో శ్రీకాంత్ నేను హీరోగా చేసిన ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, వారసుడు సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేశాడు. ఓసారి నువ్వు విలన్‌గా అయితే సినిమాలు చెయ్యొద్దు, హీరోగానే సినిమాలు చెయ్ అని కూడా చెప్పాను. తర్వాత నేను ఆశించనట్లే తను మంచి హీరో అయ్యాడు. తన కుమారుడైన రోషన్‌తో నటించేటప్పుడు రోషన్ నటనను చూస్తే తనకిది మొదటి సినిమాలా అనిపించలేదు.
రోషన్ శ్రీకాంత్ అబ్బాయి అని సపోర్ట్ చేయలేదు. ఇదొక లవ్‌స్టోరీ అంతే కాకుండా తనకు స్క్రీన్ టెస్ట్ చేసి సెలక్ట్ చేశాం. తన సెట్ కాకుండా ఉండుంటే మరో యువ హీరో కోసం వెతికేవాళ్ళం. ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఇలా చాలా మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. ఇందులో నా పాత్ర వివరాలు పూర్తిగా ఇప్పుడే చెప్పలేను పెద్ద బిజినెస్‌మేన్ పాత్రలో కనపడతాను. అలాగే ప్రేమలో హీరో హీరోయిన్స్ ప్రేమ గెలవడంలో సపోర్ట్ చేసే రోల్. అంతే తప్ప నాకంటూ కొత్త లవ్ ట్రాక్ ఉండదు. ఇక సినిమా కథను కాన్సెప్ట్ ఫిలింస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా క్యారెక్టర్‌తో కలిపే స్టోరీ నెరేట్ చేశారు. ఇన్‌స్పైరింగ్ లవ్‌స్టోరీ కావడంతో సినిమా చేయడానికి ఆసక్తి చూపాను.
అదికాకుండా ఈ మధ్య కొత్త తరహా పాత్రలు కూడా చేస్తుండటంతో చేయాలని నిర్ణయించుకున్నాను. నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నా గొంతు బాలేదని అనేవారు. తర్వాత సెట్ అయ్యిందనుకోండి అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ వచ్చి పాట పాడమని తొలిసారి అడిగినప్పుడు ఎందుకు పాడకుండా ఉంటాను. అందుకే ఒప్పుకున్నాను. ఇదే పాటను ఏ.ఆర్.రెహ్మాన్ తనయుడు అమీన్ ఈ పాట పాడటం విశేషం. భవిష్యత్‌లో కూడా సులభంగా ఉండే పాట ఇస్తే పాడే అవకాశం ఉండొచ్చు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ఆడియో విడుదల చేసి సినిమాను అనుకున్న సమయంలో సెన్సార్ పూర్తయితే సెప్టెంబర్ 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం. ఇక నేను ప్రస్తుతం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో బిజీగా ఉన్నాను.
డైరక్టర్ రాఘవేంద్రరావు సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అన్నీ అంశాలు అనుకున్నట్లు పూర్తయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి. ముందుగానే రిలీజ్ డేట్ చెప్పి తర్వాత వెనక్కు వెళ్ళడం నాకిష్టం ఉండదు. కల్యాణ్‌కృష్ణతో నేను సోగ్గాడే చిన్ని నాయనా చేస్తున్నప్పుడే నాగచైతన్య, కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. చాలా మంచి కథ కుదిరింది. నాకు నిన్నే పెళ్ళాడతా సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చైతు, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఆ స్టయిల్లో ఉంటుంది కానీ దానికి రీమేక్ కాదు.
ఇక అఖిల్ విషయానికి వస్తే తనకి మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాని వల్ల తను బాగా డిస్ట్రబ్ అయ్యాడు. కానీ దాని వల్ల తనకు ఇంకా పట్టుదల పెరిగింది. నెక్ట్స్ సినిమా విషయంలో తొందపడవద్దని ముందే చెప్పాను. తను కూడా ఓపిగ్గా వెయిట్ చేశాడు. ఇప్పుడు నాకు ఇష్టమైన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా సినిమా చేయబోతున్నాం. ఎందుకంటే నాన్న, నేను, చైతన్య, అఖిల్ కలిసి యాక్ట్ చేసిన 'మనం' వంటి క్లాసికల్ సినిమాను డైరెక్ట్ చేశాడు. మనం సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడే ఓ లవ్‌స్టోరీని చెప్పాడు.
నాకు బాగా నచ్చింది కానీ తర్వాత తను నాకు దొరకనంత బిజీ అయ్యాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాడు. రెండు వారాలు గ్యాప్ తర్వాత విక్రమ్ కుమార్ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుంది. మంచి కథ కుదిరింది. సినిమా దాదాపు నవంబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. రెండు సినిమా కథలు చాలా బాగా వచ్చాయి. అన్నపూర్ణ టీం చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. ఇక నేను కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో చేయబోయే బంగార్రాజు సినిమా వచ్చే సంవత్సరం చేసే అవకాశం ఉంది'' అన్నారు.