శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "గేమ్ ఛేంజర్". సంక్రాంతికి విడుదలకానుంది. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఇటీవలే లక్నో వేదికగా ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే స్పందన వచ్చింది. గురువారం ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. చెర్రీ - కియారా అద్వానీ జోడీ మధ్య కెమిస్ట్రీని ఇట్టే కళ్లకు కట్టినట్టుగా దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు.
తెలుగులో 'నా నా హైరానా..' అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా ఈ పాట ప్రేక్షకులను సమ్మోహనపరుస్తోంది. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌశర్ మునీర్ రాశారు. ఈ పాటకు సంబంధించిన బీటీఎస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
మేకింగ్ విషయానికి వస్తే శంకర్ తనకు తానే సాటి అని మరోసారి 'నా నా హైరానా..' పాటతో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాటను ఇప్పటివరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీతో ఈ పాట మనసుని తేలిక పరుస్తుంది.
మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతీ ఫ్రేమ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ప్యూజన్ మెలోడీగా ట్యూన్ చేశారు. సరిగమ మ్యాజిక్ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాలోని శ్రేయా ఘోషల్, కార్తీక్ ఆలపించారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు.