Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండా బయోపిక్ తర్వాత నా జీవితమే మారిపోయింది - హీరో త్రిగుణ్‌

Advertiesment
Trigun
, సోమవారం, 20 జూన్ 2022 (16:58 IST)
Trigun
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా త్రిగుణ్‌తో ఇంటర్వ్యూ.
 
రామ్ గోపాల్ వర్మ తీసిన బయోపిక్స్ అన్నీ హిట్. 'కొండా' బయోపిక్‌కు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నప్పుడు ప్లెజర్ ఫీలయ్యారా? ప్రెజర్ ఫీలయ్యారా?
 రామ్ గోపాల్ వర్మ గారి శైలిలో చెప్పాలంటే... పెయిన్, ప్లెజర్ రెండూ ఉన్నాయి. ఆయనతో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను.  వెయిట్ చేస్తున్నా. 'కథ' విడుదలకు నాలుగు రోజుల ముందు ఆయన్ను కలిశా. 'నాతో సినిమా చేయండి' అని అడిగా. వర్మ గారి అమ్మాయి నా క్లాస్‌మేట్‌కు ఫ్రెండ్. ఆయన సిస్టర్ పిల్లలు నాకు తెలుసు. వీళ్ళందరినీ పట్టుకుని ఆయన దగ్గరకు వెళ్ళేవాడిని. 'రొమాంటిక్ హీరోలా ఉంటాడు. క్యూట్ బాయ్. నా స్టైల్ కాదు' అని చెప్పేవారు. మళ్ళీ నాలుగేళ్ళ క్రితం కలిశా. 'బావున్నావు. ఏదో ఒకటి చేద్దాం' అన్నారు. అది ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు, నిర్మాత చెప్పే మాటే.  నాకు హోప్స్ పోయాయి. అప్పుడు నాతో సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మొదట రెండు మూడు కథలు చెప్పారు. మళ్ళీ తనకు నచ్చలేదన్నారు. 'నువ్వు ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నావ్' అని అడిగారు. ''నేను 'తుంగభద్ర' సినిమా చేశా. అప్పట్లో ఆడలేదు. కానీ, మంచి సినిమా. యాక్షన్ ఫిల్మ్ చేయాలనుంది'' అని చెప్పా. ఆర్కే, నయీమ్, గణపతి... తెలంగాణలో కొంత మందిపై రీసెర్చ్ చేశారు. వేరే పాత్ర కోసం లుక్ టెస్ట్ కూడా చేశాం. నిర్మాత ఎవరు? కథేంటి? ఏమీ తెలియదు. రోజూ వర్మగారితో కూర్చుని డిస్కస్ చేసేవాడిని. మీకు ఈ విషయాలు తెలియాలంటే కొండా మురళిని కలవమని ఎవరో చెప్పారు. మురళి గారిని కలిసిన తర్వాత వర్మ గారు ఫోన్ చేసి 'నా స్క్రిప్ట్ దొరికింది. మనం మురళి మీద సినిమా చేస్తున్నాం. నువ్వు ఆయన రోల్ చేస్తున్నావు' అని చెప్పారు. తర్వాత రోజు 70 సన్నివేశాలతో కూడిన వన్ లైన్ ఆర్డర్ స్క్రిప్ట్ పంపించారు.  అలా 'కొండా' సినిమా మొదలైంది. 
 
వర్మ తీసిన బయోపిక్స్‌కు, 'కొండా'కు డిఫరెన్స్ ఏంటి?
 'రక్త చరిత్ర', 'వంగవీటి' బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. ఎక్కువ పాత్రల మీద నడుస్తాయి. 'కొండా' అనేది బయో ఫిక్షన్. ఇందులో రెండు పిల్లర్స్ ఉన్నాయి. కొండా మురళి గారు, సురేఖమ్మ గారు. ఉద్యమంలో ప్రేమకథ పుట్టింది. అదొక కమర్షియల్ పాయింట్. ఈ తరహా సినిమాల్లో ప్రేమకథ పెడితే సహజంగా ఉండదు. కానీ, ఈ సినిమాలో అదొక నేచురల్ పాయింట్. 'కొండా' కథలో చెప్పాల్సిన కథలు, వరంగల్ చుట్టూ జరిగినవి చాలా ఉన్నాయని వర్మ అన్నారు. మురళి గారు, సురేఖమ్మ పాత్రలు, వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయో ఫిక్షన్ మధ్య వ్యత్యాసం ఉంది. 
 
నక్సలైట్ నుంచి రాజకీయ నేత వరకూ... కొండా మురళి ప్రయాణంలో మీరు చూసిన బలం ఏమిటి? బలహీనత ఏమిటి?
సమాజంలో మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని చేధించుకుని కొండా మురళి ఎదిగారు. జీవితంలో అవరోధాలు వచ్చినప్పుడు తొమ్మిది మంది ఆగుతారు. ఒక్కడు మాత్రం అన్నిటినీ దాటుకుని ముందుకు వెళతాడు. ఆ ఒక్కడి కథ 'కొండా'. అది నాకు నచ్చింది. ఇండస్ట్రీలో నాకు ఎదురైన పరిస్థితులు, జీవితంలో మురళి గారికి ఎదురైన పరిస్థితులు ఒక్కటే. నేను నా పరిమితులను దాటుకుని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకని, మురళి గారి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. 
 
కొండా మురళి పాత్ర కోసం మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
 'భాగ్ మిల్ఖా భాగ్' లాంటి బయోపిక్ అయితే అథ్లెట్ బాడీ కావాలి. 'కొండా' వంటి సినిమాకు క్యారెక్టర్‌లా కనిపిస్తే చాలు. ఈ సినిమా కోసం ఆరేడు కేజీల బరువు పెరిగా. రెండు మూడు ఫోటోషూట్స్ చేసేసరికి మీసం, గడ్డం... లుక్ అంతా వచ్చేసింది. క్యారెక్టర్ స్పిరిట్ పట్టుకోమని వర్మ గారు చెప్పారు. ఆ రోజుల్లో ఒకరిని చంపినా, రేప్ చేసిన అడగడానికి దిక్కు లేదు. జమీందార్లు, కుల వ్యవస్థ కారణంగా స్టూడెంట్స్ ఉద్యమంలోకి వచ్చారు. ఈ సంగతులు వర్మ గారు చెప్పారు.  
 
ఎమోషన్స్ పరంగా సినిమా ఎలా ఉంటుంది?
 పీక్స్‌లో ఉంటుంది. వర్మ గారు 40, 50 ఇన్సిడెంట్స్ రాశారు. ఇవన్నీ తీస్తే వెబ్ సిరీస్ అవుతుందని, పీక్ మూమెంట్స్ కొన్ని తీసుకున్నారు. ఒక సన్నివేశంలో 47 బుల్లెట్స్ ఫైర్ అవుతాయి. ఇటువంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. 'ఎలా ఆడుతుందో నాకు తెలియదు. కానీ, క్రాఫ్ట్స్ పరంగా ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో 'కొండా' ఒకటి' అని వర్మ గారు చెప్పారు.    
 
కథలో మురళి, సురేఖ ఇద్దరి పాత్రలు కీలకమే కదా!
అందుకే 'కొండా' అని టైటిల్ పెట్టారు. మురళి, సురేఖమ్మ... కొండా కింద ఇద్దరి పేర్లు రాసుకోవచ్చు. 'మురళి వెనుక మహిళ ఉండటంతో ఆయన బతికారు' అని వర్మ గారు చెప్పారు. చాలా నిర్ణయాలను మార్చిన ఘనత సురేఖమ్మది. మదర్ రోల్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తులసి గారు తల్లిగా, ఎల్బీ శ్రీరామ్ గారు తండ్రిగా నటించారు. సురేఖమ్మ పాత్రలో ఇర్రా మోర్ చక్కగా నటించింది. కొండా ఫ్యామిలీకి పెట్ డాగ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు కుక్కలు అంటే ఇష్టం. అందుకని, వర్మ గారు సినిమాలో ఒక పెట్ డాగ్ రోల్ పెట్టారు. 
 
 'కొండా' బయోపిక్ తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏమిటి?
పేరు మారింది. జీవితమే మారింది. ఒకటి రెండేళ్ల నుంచి నాలో, నా ప్రయాణంలో మార్పులు వచ్చాయి. బయోపిక్ అని కాదు... కొవిడ్‌లో ఆలోచించే సమయం దొరికింది. దాంతో నాలో మార్పు వచ్చింది.
 
పేరు మార్చుకోవడం మీకు కలిసి వచ్చినట్టుంది?
 బయట అంతా వర్మ మీద తోసేస్తున్నారు గానీ... పేరు మార్చుకోవాలనే ఐడియా నాదే. మా అమ్మ పెట్టిన పేరు ఇది. నన్ను నేను రీ బ్రాండ్ చేసుకోవాలని పేరు మార్చుకున్నా. 
 
 'కొండా' తర్వాత మీరు చేస్తున్న సినిమా?
 'ప్రేమ దేశం' విడుదల అవుతుంది. అందులో నేను, మేఘా ఆకాష్ జంటగా నటించాం. ఆ చిత్రానికి మణిశర్మ గారు సంగీతం అందించారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అని మరో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. దేవ కట్టా గారి శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. మిస్కిన్ గారి దర్శకత్వంలో మరో సినిమా ఉంది. దానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు ప‌ర్పుల్ రాక్‌ అని బ్యానర్ పెట్టారు. అందులో 'లైన్‌మేన్‌' అని సినిమా చేస్తున్నా. 'కిరాయి' అని ఇంకో సినిమా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగర్ సునీత కుమార్తె ఫోటోలు నెట్టింట వైరల్.. హీరోయిన్స్‌కు పోటీగా..?