Megastar Chiranjeevi in the House of Commons in the U.K.
బుధవారం (మార్చి 19, 2025) మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. యుకె పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు,మంత్రులు, అండర్ సెక్రటరీ లు, దౌత్యవేత్తలు మెగాస్టార్ చిరంజీవి ని సత్కరించారు. అదే సమయంలో, ఆయనకు బ్రిడ్జి ఇండియా అనే ప్రఖ్యాత యూకేకి చెందిన సంస్థ నుంచి సాంస్కృతిక నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ప్రజాసేవకుగానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
బ్రిడ్జి ఇండియా సంస్థ ఒక వ్యక్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాంటి అరుదైన సందర్భంలో చిరంజీవి కి ఆ అవార్డు రావడం నిజంగా ఎంతో ప్రత్యేకమే కాదు.. అసాధారణ గౌరవం కూడా.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... హౌస్ ఆఫ్ కామన్స్ - యుకె పార్లమెంట్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అండర్ సెక్రటరీ లు, దౌత్యవేత్తల చే గౌరవించబడటం గౌరవంగా భావిస్తున్నాను. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ క్రమంలో సభ్యులు నాపై గౌరవ భావాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలకు నేను ధన్యుడిని. బ్రిడ్జి ఇండియా బృందం నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవటం నన్నెంతగానో ఉత్సాహపరిచింది అంటూ చిరంజీవి తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపు కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ గౌరవం తనను మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఇలా పేర్కొన్నారు. మాటలు సరిపోవు. అద్భుతమైన ప్రేమాభిమానాలను చూపించే అభిమానులు, రక్త దాతలు , నా సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించిన వారు, నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంతో పని చేయడానికి ప్రేరేపిస్తుంది. నాపై మీ కున్న ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ అందరూ ఎన్నో అభినందన సందేశాల ను పంపారు. వారందరికీ ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, దౌత్యవేత్త లతో సహా అనేక ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. చిరంజీవి వారందరికీ సోషల్ మీడియా ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాజరైన వారిలో సర్ స్టీఫెన్ టిమ్స్ (సామాజిక భద్రత, వైకల్యం కోసం రాష్ట్ర మంత్రి), నవేందు మిశ్రా (స్టాక్‌పోర్ట్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), సోజన్ జోసెఫ్ (ఆష్‌ఫోర్డ్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), డేవిడ్ పింటో (హెండన్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), ఉమా కుమారన్ (స్ట్రాట్‌ఫోర్డ్, బో నుండి లేబర్ పార్టీ ఎంపీ), గురిందర్ సింగ్ జోసన్ (స్మెత్‌విక్ నుండి లేబర్ పార్టీ ఎంపీ), బగ్గీ షంకర్ లేదా భగత్ సింగ్ షంకర్ (డెర్బీ సౌత్ నుండి లేబర్ పార్టీ ఎంపీ), డానీ బీల్స్ (అక్స్‌బ్రిడ్జ్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), డీడ్రే కాస్టిగన్ (ఈలింగ్ సౌత్‌ఆల్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), లార్డ్ సహోతా (లైఫ్ పీర్ నుంచి లేబర్ పార్టీ ఎంపీ), బాబ్ బ్లాక్‌మన్ (సీబీఈ - కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, పద్మశ్రీ అవార్డీ), వీరేందర్ శర్మ (ఈలింగ్ సౌత్‌ఆల్ నుంచి మాజీ లేబర్ పార్టీ ఎంపీ, ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియా మాజీ చైర్మన్ ), ఉదయ్ నాగరాజు (నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుండి లేబర్ పార్టీ ఎంపీ), గారెత్ విన్ ఓవెన్ (తెలుగు రాష్ట్రాలకు యుకె డిప్యూటీ హై కమిషనర్). సీమా మల్హోత్రా (సమానత్వం, వలసలు & పౌరసత్వం కోసం అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్) కూడా చిరంజీవి తో సంభాషించి ఆయనను అభినందించారు. చిరంజీవి బ్రిడ్జ్ ఇండియా నుండి ప్రతీక్ దత్తాని, అమన్ ధిల్లాన్‌లకు కూడా తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు.