నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అంటే అభిమానులకు పెద్ద పండగ. ప్రతి ఏడాదీ ఆయన పుట్టినరోజైన జూన్ 10న అభిమాన కథానాయకుడిని కళ్లారా చూసేందుకు, మనసారా కలిసేందుకు ప్రపంచం నలుదిక్కుల నుంచి ప్రజలందరూ హైదరాబాద్ తరలి వస్తుంటారు. కరోనా నేపథ్యంలో అభిమానులు అందరూ ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని, అందువల్ల ఎవరూ తనను కలవడానికి రావొద్దని బాలకృష్ణ సవినయంగా తెలియజేశారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "నా ప్రాణ సమానులైన అభిమానులకు ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు.
నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం.
ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను.
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.
మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక.
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తున్నాను" అని అన్నారు.
ఈ కరోనా విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులకూ, కార్యకర్తలకూ, అభాగ్యులందరికీ బాలకృష్ణ నివాళులు అర్పించారు.