''మెర్సల్'' వివాదం.. పైరసీ కాపీని చూశావా? పెద్దమనిషిగా వుండి సిగ్గులేదా?: విశాల్ ప్రశ్న
కోలీవుడ్ హీరో విజయ్ త్రిపాత్రాభినేయం చేసిన 'మెర్సల్' దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై డైలాగు
కోలీవుడ్ హీరో విజయ్ త్రిపాత్రాభినేయం చేసిన 'మెర్సల్' దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.
సింగపూర్ కన్నా ఎక్కువగా భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవని విజయ్ చెప్పిన డైలాగులపై వివాదం రేగింది. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను 'మెర్సెల్' పైరసీ కాపీని చూశానని... సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
అయితే రాజా వ్యాఖ్యలపై తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ మండిపడ్డారు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు. సంఘంలో పెద్దమనిషిగా వుంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పేందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని... పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు.