ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసేవ (జనసేవ) చేసేందుకు సైతం యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాయి. జనసైనికులు అనేక ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేశారు.
అయితే, అధికార వైకాపా పార్టీ నేతల ఒత్తిడి మేరకు... పోలీసులు రోడ్లు బాగుచేయనివ్వకుండా కొందరు అడ్డంకులు సృష్టించారని జనసేన తెలిపింది. దీనిపై సినీనటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
'మన రాష్ట్రంలోని దుస్థితి ఏంటంటే జనసేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోంది. చంద్రగిరి నియోజక వర్గంలోని జనసైనిక్ మనోహర్ దేవర శ్రీవిద్యా నికేతన్ సంస్థ సమీపంలో అరకిలోమీటరు రోడ్డును బాగు చేయించారు. కొందరు అడ్డుకోవాలని చూసినప్పటికీ విజయవంతంగా పని పూర్తి చేశారు' అని నాగబాబు చెప్పారు.
కాగా, రోడ్డు వేసేందుకు కావాల్సిన మెటీరియల్‌ను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని కొందరు ప్రయత్నాలు చేశారని వీడియోలో జనసేన చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి నాగబాబు షేర్ చేశారు.