మే 22 తేదీకీ, మా అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉంది అన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో నేను, చైతు, అఖిల్ కలిసి నటించిన 'మనం' చిత్రం ప్రివ్యూను మే 22 రాత్రి ప్రసాద్ ఐమాక్స్‌లో వేసినప్పుడు నాన్నగారితో బాగా అనుబంధం ఉన్న ఒక వ్యక్తి నా దగ్గిరకు వచ్చి మే 22 తేదీనే నాన్నగారు హీరోగా నటించిన తొలి చిత్రం 'సీతారామ జననం'లో నటించడానికి ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్‌కి వెళ్ళారని చెప్పారు.
అప్పుడే ఈ డేట్‌కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి నాకు తెలిసింది. మే 23న 'మనం' రిలీజ్ అయ్యింది. ఆ రోజు అందరూ ఫోన్ చేస్తూ నాకు ఈ సినిమా హిట్‌తో పాటూ నా తొలి చిత్రం 'విక్రమ్' రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు అయిందని చెప్పడం మొదలెట్టారు. నాన్నగారితో మేమంతా కలిసి నటించిన 'మనం', నేను నటించిన ఫస్ట్ పిక్చర్ 'విక్రమ్' ఒకే రోజు రిలీజ్ అవడం కూడా ప్లాన్ చేసింది కాదు.
నాన్నగారు ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ప్రముఖ నటులు పెకేటి శివరాం గారు నాన్నగారిని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని ఆఫీస్ లోకి తీసుకెళ్ళడమే కాకుండా షూటింగ్ ఫస్ట్ డేన ఫస్ట్ షాట్ తీసేటప్పుడు దగ్గిరుండి మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చారు. అదే విధంగా నా తొలి చిత్రం 'విక్రమ్'కి కూడా పేకేటిగారు ప్రత్యేకంగా వచ్చి ఫస్ట్ షాట్ తీసేటప్పుడు నన్ను మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్‌కి తీసుకొచ్చారు.
విక్రమ్ ఓపెనింగ్ స్టిల్‌లో కూడా నాన్నగారు, డైరెక్టర్ మధుసూదన రావు గారి మధ్య పేకేటిగారు ఉన్నారు. నాన్నగారి పిలుపు మేరకు ఆ రోజు విక్రమ్ ఓపెనింగ్‌కి విచ్చేసిన దాసరి గారు నాకు 'మజ్ను'తో మంచి విజయాన్ని అందిస్తే, రాఘవేంద్రరావు గారు 'అన్నమయ్య' లాంటి మరిచిపోలేని గొప్ప చిత్రాన్ని ఇచ్చారు. 'అన్నమయ్య' కూడా మే 22నే విడుదలై గొప్ప చరిత్ర సృష్టించింది.
అందుకే మే 22 ఉదయం నుండే అందరూ 'మనం' గురించి, 'అన్నమయ్య' గురించి, 'విక్రమ్' గురించి నాకు ఫోన్లు చేస్తూ అభినందిస్తుంటారు. ఇలా ఆ డేట్‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా మా నాన్నగారు సినీ పరిశ్రమ లోకి రావడానికి మద్రాసు మహానగరంలో అడుగు పెట్టిన రోజది. అందుకే ఆ డేట్ అంటే నాకు ఎంతో ఇష్టం. 'విక్రమ్' మే 23న రిలీజ్ అయ్యింది.
విక్రమ్ డైరెక్షన్లో మేము తీసిన 'మనం' కూడా మే 23న రిలీజ్ అయ్యింది. ఇదంతా ప్లాన్ చేసింది కాదు కానీ ఏదో అలా డిజైన్ చేసినట్లు జరిగింది. నాన్నగారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 22నే, 23న సాధించిన విజయాలను అభినందిస్తూ ఫోన్లు వస్తుంటాయి. అందుకే మే 22వ తేదీ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విక్రమ్‌తో ప్రారంభమైన నా నటజీవితం 34 ఏళ్ళు సక్సెస్‌ఫుల్‌గా పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారకులైన ప్రేక్షకులకు, మా అక్కినేని అభిమానులకు, మా అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అన్నారు కింగ్ నాగార్జున.