ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్‌తో భేటీ కేవలం వ్యక్తిగతమేనని చెప్పారు. అన్నావదినతో కలిసి లంచ్ చేయడానికి వచ్చానని ఈ సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు.
అదేసమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, విష్ణు తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ముఖ్యమంత్రిని కలవాలని భావించారన్నారు. ఆయనకు కూడా సీఎం నుంచి ఆహ్వానం అందిందని, కానీ, దాన్ని మా డాడీకి చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వారు ఎవరో సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు.
ఇకపోతే, 'కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సినిమా పరిశ్రమ ఒక పెద్ద కుటుంబం. అంతర్గతంగా సమస్యలను పరిష్కరించుకుంటాం' అని ఆయన పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలింపుపై మా ప్రెసిడెంట్ స్పందిస్తూ.. సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు లాంటివి అంటూ తెలుగువాళ్లంతా మాకు కావాలి అని వ్యాఖ్యానించారు.