ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 90 యేళ్ళ లతా మంగేష్కర్.. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు... అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటికే పరిమితమైన ఆమె.. సోమవారం ఉన్నట్టు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. తక్షణ అత్యవసర సేవల విభాగం (ఐసీయు)కి తరలించి సేవలందించారు. వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం కాస్త విషమంగానే ఉన్నప్పటికీ, నెమ్మదిగా కోలుకుంటున్నట్టు సోమవారం సాయంత్రం ప్రటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై మంగళవారం మరో వైద్య బులిటెన్‌ను విడుదల చేశారు.
'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నిజం చెప్పాలంటే సమస్య నుండి తిరిగి బయటకి వచ్చేందుకు ఆమె చాలా పోరాడుతున్నారు. గాయని కావడంతో ఆమె ఊపిరితిత్తులకి ఉన్న సామర్థ్యమే గట్టెక్కిస్తుంది. నిజంగా ఆమె పోరాటయోధురాలు. లతాజీ డిశ్చార్జ్ అయి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే మీ అందరికి ఈ విషయాన్ని తెలియజేస్తాం. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకి కొద్దిగా స్వేచ్ఛని ఇవ్వండి' అంటూ ఆస్పత్రి పీఆర్వో విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.