నటిపై అఘాయిత్యం పక్కా స్కెచ్ వేసింది మాజీ డ్రైవరేనా! నమ్మని పోలీసులు
ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు నిందితుల్లో ఒకడైన మణికందన్ పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ నేరానికి పక్కా స్కెచ్ గీశాడని, పూర్తిగా అతని ప్లాన్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జ
ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు నిందితుల్లో ఒకడైన మణికందన్ పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ నేరానికి పక్కా స్కెచ్ గీశాడని, పూర్తిగా అతని ప్లాన్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని అతను తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాధితురాలి మాజీ డ్రైవర్ అయిన అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నేరంలో పల్సర్ సునికి సహకరించిన మణికందన్‌ను సోమవారం రాత్రి పాలక్కడ్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నటి కారులోకి ప్రవేశించి దాడి చేసేవరకు.. పల్సర్ సుని ప్లాన్ గురించి తమకు తెలియదని చెప్పాడు. 'ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి పిలిచాడు. ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను. కానీ నటి మీద దాడి చేసేందుకు మమల్ని పిలిచాడని తర్వాత తెలిసింది. ఆమె కారులోకి మేం వెళ్లాక.. నేను మాత్రం తనపై దాడి చేయలేదు' అని అతను పోలీసులకు తెలిపినట్టు విశ్వనీయవర్గాలు తెలిపాయి.
నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ నేరంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు పల్సర్ సునితో గొడవ పడ్డారని, వారికి రూ. 30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పాడు. మణికందన్ చెప్పింది పూర్తిగా పోలీసులు విశ్వసించడం లేదని సమాచారం. అతన్ని మరింతగా విచారించిన అనంతరం ఆ రోజు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. కాగా, నటిపై దాడి జరిగిన వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పోలీసులు అప్పగించారు.