తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికి దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించడం గొప్ప విషయమని కేసీఆర్ అన్నారు.
సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను రజనీకాంత్‌కు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.
51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్టు ఆయన తెలియజేశారు. 1969 నుండి ఈ అవార్డులని ప్రకటిస్తుండగా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ అవార్డును బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్నారు.
ఇకపోతే, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్ తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 2019 సంవత్సరానికి గాను రజినీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోనున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీరు విషెస్ అందించారు.
"నా ప్రియమైన స్నేహితుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకు మీరు చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ అత్యున్నత పురస్కారం మీకు దక్కినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే, ఇక టాలీవుడ్ హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ సినిమాకు మీరు చేసిన సేవలు అసమానం. ఎంతో మందికి మీరు ఆదర్శం అని అన్నారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోబోతున్న మీకు నా శుభాకాంక్షలు అంటూ వెంకీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.