కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణానికి గల కారణాలను బెంగుళూరు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పునీత్ మృతికి తీవ్ర గుండెపోటే కారణమని వైద్యులు నిర్ధారించారు.
కాగా, శుక్రవారం జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఇబ్బందికి గురైన పునీత్‌ను ఉదయం 11.45 గంటలకు విక్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్‌కు వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణించారు.
"ఆ రోజు (శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు పునీత్ రాజ్‌కుమార్ వ్యాయామం చేశారు. టిఫిన్ చేసిన తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో భార్య అశ్వినితో కలిసి తమ కుటుంబ వైద్యుడు డాక్టర్ రమణారావు నిర్వహించే రమణశ్రీ క్లినిక్‌కు వెళ్లారు.
అక్కడ పునీత్ వైద్యులతో మాట్లాడుతూ జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చాక చెమటలు పట్టాయని, అన్ని రకాల వ్యాయామాలు చేశానని డాక్టర్ రమణారావుకు చెప్పారు. బాక్సింగ్ కూడా చేశానని, ఆ తర్వాత ఏదో ఇబ్బంది అనిపించిందని చెప్పారు. దీంతో వెంటనే వైద్యులు ఆయనకు ఈసీజీ తీసి పరిశీలిస్తే హృదయ స్పందనలో తేడా కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
కారు వరకు నడిస్తే ఇబ్బంది పడతారని భావించి చక్రాల కుర్చీలో కారు వరకు తీసుకెళ్లారు. అదేసమయంలో విక్రమ్ ఆసుపత్రికి ఫోన్ చేసిన పునీత్ భార్య అశ్విని పరిస్థితి వివరించారు. ఈలోగా ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. పునీత్ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వెంటిలేటర్ అమర్చారు. అయితే, అప్పటికే తీవ్ర గుండెపోటుకు గురికావడంతో కాసేపటికే పునీత్ మరణించినట్టు" డాక్టర్ రమణారావు వివరించారు.