బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెల్లికి ట్విట్టర్ యాజమాన్యం తేరుకోలేని షాకిచ్చింది. ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. తాజాగా, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనపై ఆమె ట్వీట్ చేయగా, అది నిబంధనలకు వ్యతిరేకమంటూ ట్విట్టర్ ఘాటుగా స్పందించడమేకాకుండా, ఆమె ఖాతాను నిలిపివేసింది.
నిజానికి బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో తమ గళం బలంగా వినిపించే వారిలో కంగనా రనౌత్ ఒకరు. ఆమె తరపున ఆమె సోదరి రంగోలీ చందేల్ బలంగా తమ గళాన్ని వినిపిస్తుంటారు. అయితే, ఇపుడు ఈ ఖాతా మూగబోయింది.
నిజానికి రంగోలీ చందేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. కానీ, ముఖ్యంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరిగే అనేక అంశాలపై స్పందిస్తూ, సినీ ప్రముఖులకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంటారు. పైగా, ఆమె ఏ ట్వీట్ చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. ఆమె కామెంట్లు వివాదాస్పదమైన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి.
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ఓ వ్యక్తి మరణించగా, వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు రాగా స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రంగోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
రంగోలీ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫిలింమేకర్ రీమా కగ్టి తీవ్రంగా స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. అలాగే, ట్విట్టర్ యాజమాన్యం కూడా రంగోలీ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకుని ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది.