టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు, యువపారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది. ఈ నెల 30వ తేదీన ముంబైలో కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా వారిద్దరి పెళ్లి జరిగింది.
ఈ వివాహంపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ, తమ ప్రేమ, డేటింగ్ విశేషాలను వెల్లడించింది. పదేళ్ల క్రితం తాము కలిశామని, తమ పరిచయం స్నేహంగా మారిందని, ఏడేళ్ల పాటు తాము స్నేహాన్ని కొనసాగించి, ఆ తర్వాత మూడేళ్లు డేటింగ్ చేశామన్నారు. గౌతమ్ కంటే తానే ఎక్కువ రొమాంటిక్ అని ఆమె తెలిపింది.
తామిద్దరం వీలు కుదిరినప్పుడల్లా కలిసేవాళ్లమని తెలిపింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో తామిద్దరం ఇటీవలికాలంలో మాస్కులు వేసుకుని కిరాణా షాపుల వద్ద మాత్రమే కలుసుకునే వాళ్లమని చెప్పింది. ఆ సమయంలోనే తమకు ఒకరి జీవితంలో మరొకరు ఎంత ముఖ్యమో అర్థమైందని తెలిపింది.
చివరకు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తామిద్దరి మధ్య ప్రేమ ప్రపోజల్ వంటిది ఏమీ జరగలేదని తెలిపింది. తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎంతటి ప్రాముఖ్యం ఇస్తున్నాడన్న విషయాన్ని గౌతమ్ తనకు చెప్పాడని తెలిపింది.
ఈ విషయంలో తామిద్దరి మధ్య చాలా భావోద్వేగభరిత చర్చ జరిగిందని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన తన తల్లిదండ్రులను కలిశాడని తెలిపింది. దీంతో పెళ్లి నిశ్చయమైందని చెప్పింది.