కుమారస్వామిగారూ ప్లీజ్.. కాలాకు సహకరించండి : రజినీకాంత్
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక విజ్ఞప్తి చేశారు. ప్లీజ్ కుమారస్వామిగారూ.. "కాలా" చిత్రం విడుదలకు సహకరించాలని ప్రాధేయపడ్డారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక విజ్ఞప్తి చేశారు. ప్లీజ్ కుమారస్వామిగారూ.. "కాలా" చిత్రం విడుదలకు సహకరించాలని ప్రాధేయపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం కన్నడభాషలో ఓ సందేశం పంపారు. తన తాజా చిత్రం "కాలా" విడుదలయ్యే థియేటర్లకు భద్రత కల్పించాలని ఆయన కోరారు.
కావేరీ జలాల నిర్వహణా మండలి ఏర్పాటు కోసం తమిళనాడులో సాగిన ఆందోళనలకు రజినీకాంత్ మద్దతు ప్రకటించారు. ఇది కన్నడ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో రజినీ చిత్రం 'కాలా' విడుదలకాకుండా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. దీంతో కాలా విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి.
ఈ నిషేధంపై చిత్ర యూనిట్ కర్ణాటక హైకోర్టు తలుపు తట్టింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు... సినిమా విడుదల అడ్డుకోలేమని క్లియరెన్స్ ఇచ్చింది. థియేటర్ల వద్ద భద్రతను కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపింది. ఈ తీర్పుపై కుమారస్వామి స్పందిస్తూ, కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడమే మంచిదని నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచిస్తున్నానని తెలిపారు.
ఒక కన్నడిగుడిగా తాను చెబుతున్నానని... ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదలైతే, అనవసరమైన వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే, సినిమా ప్రదర్శనకు సహకరించాలంటూ కుమారస్వామికి రజనీకాంత్ విన్నవించడం గమనార్హం.