Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కటిక దారిద్ర్యంలో ఇళయరాజాతో సంగీత ఓనమాలు దిద్దించిన సంగీత మేధావి!

ఇసైజ్ఞాని ఇళయరాజా. ఈయనతో సంగీత ఓనమాలు దిద్దించిన సంగీత మేధావి ఇపుడు కడు పేదరికంలో జీవిస్తున్నారు.

Advertiesment
Jayalalithaa
, బుధవారం, 8 జూన్ 2016 (13:17 IST)
ఇసైజ్ఞాని ఇళయరాజా. ఈయనతో సంగీత ఓనమాలు దిద్దించిన సంగీత మేధావి ఇపుడు కడు పేదరికంలో జీవిస్తున్నారు. ఆయన పేరు గోవర్ధన్. వయసు 88 యేళ్ళు. కటిక దారిద్ర్యంలో, చిన్నపాటి ఇంటిలో తన భార్యతో కలిసి వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఓ తమిళ వారపత్రిక తాజాగా వెలుగులోకి తెచ్చింది. 
 
తమిళ చిత్రపరిశ్రమలోని పాతతరం సంగీత దర్శకుల్లో గోవర్ధన్ ఒకరు. ఈయన 'అంజల్‌పెట్టి 520', 'పూవుమ్‌పొట్టుమ్', 'పట్టణత్తిల్‌ బూదమ్'‌, 'పొర్‌సిలై', 'రాము', 'వరప్రసాదం' వంటి అనేక చిత్రాలు సంగీత బాణీలు సమకూర్చారు. అంతేకాకుండా ఇసైజ్ఞాని ఇళయరాజా, ఈయన సోదరుడు గంగై అమరన్‌లకు సైతం సంగీత ఓనమాలు దిద్దించారు. వీరిద్దరు గోవర్ధన్ వద్ద కొంతకాలం సహాయకులుగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన సేలం పట్టణంలో ఓ చిన్నపాటి ఇంట్లో అష్టకష్టాలు పడుతున్నారు. కడు పేదరికంలో జీవిస్తూ.. ఆకలితో అలమటిస్తున్నారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత క్షణాల్లో స్పందించారు. ఎంజీఆర్‌ ట్రస్టు నుండి గోవర్ధన్ దంపతులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆ నగదును గోవర్ధన్ పేరిట డిపాజిట్‌ చేసి ఆ నగదుపై వచ్చే నెలసరి వడ్డీ రూ.8,120ని ఆ కుటుంబ ఖర్చులకు వ్యయం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. 
 
అలాగే, గోవర్ధన్ కోరిక మేరకు ఆయనకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వినికిడి యంత్రాన్ని కూడా తక్షణమే అందజేయాలని సేలంలోని ప్రభుత్వ ఆరోగ్య అధికారులను ఆదేశించారు. వినికిడి యంత్రం పనిచేయకపోతే శస్త్రచికిత్స జరపాలని కూడా అధికారులకు ఉత్తర్వులివ్వడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిమ్ కర్దాషియన్ బాటలో ఆఫ్రికా మహిళలు.. 'బాటమ్స్' ఆపరేషన్లపై మక్కువ