Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడవరకు కళాకారుడేనని నిరూపించుకున్న జె.వి. సోమయాజులు

(ఈరోజు వారి వర్థంతి)

కడవరకు కళాకారుడేనని నిరూపించుకున్న జె.వి. సోమయాజులు
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:50 IST)
JV somayajulu
తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రి గా పేరుగాంచిన సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సోమయాజులు) 30-6-1928న శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు.  ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి.రమణమూర్తి.ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. 
 
సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు 
ఇచ్చారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో 'రామప్ప పంతులు' పాత్రకు ప్రసిద్ధుడయ్యారు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.
 
జె.వి.సోమయాజులు స్వయంకృషితో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. తనసోదరుడు జె.వి.రమణమూర్తితో కలిసి కృషి చేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు.  తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన 'కన్యాశుల్కం'  నాటకాన్ని తొలి ప్రదర్శన ఇచ్చారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు.  దీనితర్వాత ఆంధ్రనాటక కళాపరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, 
 
నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు  గెలుచు కున్నారు.
రెవిన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి 
చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు 
శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన  'రారాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా,  ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. 
శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా  ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. 
దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు.
 
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం 'శంకరాభరణమే'. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. 'శంకరాభరణం' విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి  మర్రి చెన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు.రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు.
 
ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. 
హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన సేవలు చెప్పుకోదగింది.
శంకరాభరణం సినిమాలో 'శంకరశాస్త్రి' పాత్రతో ప్రసిద్ధుడైన తర్వాత అనేక తెలుగు చిత్రాల్లోనే కాక కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. 
టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 
13 భాగాల నాటకంగా రూపొందించారు. 
150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్‌లో కూడా
ఎన్నో పాత్రలు ధరించారు.  చివరి శ్వాసవరకు నటనమీద గౌరవంతో
ఆరాధనాభావంతో జీవించారు. చివరిదశలో 
ఆరోగ్యం సహకరించక పోయినా చేయగలిగినంత చేశారు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించిన వీరు 2004 ఏప్రిల్‌ 27వ తేదీన ఈ లోకంనుండి నిష్క్రమించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50మిలియ‌న్స్‌కి పైగా చేరుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై`