Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూప‌ర్‌స్టార్ కృష్ణ ఆవిష్క‌రించిన - జై విఠ‌లాచార్య్య‌ - ఫస్ట్ లుక్

Advertiesment
Superstar Krishna
, శుక్రవారం, 19 నవంబరు 2021 (17:01 IST)
Pulagam Chinnarayana, Superstar Krishna, Sheikh Jilan Basha
ప్యాన్‌ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న జోనర్‌ ఫోక్‌లోర్‌. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ... ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన  మేకింగ్‌ మీద సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అలాంటిది. అందుకే విఠలాచార్య దర్శకత్వం వహించినా, నిర్మించినా... ఆ సినిమాలను ప్రదర్శించే థియేటర్లు హౌస్‌ఫుల్స్ తో కళకళలాడేవి. తరాలు మారినా ఆయన సినిమాలను చూడని, పొగడని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో!
 
దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని  సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు.  ఆ సమగ్ర పుస్తకానికి 'జై విఠలాచార్య' అని పేరు పెట్టారు. 
'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.
ఈ పుస్తకం ఫస్ట్ లుక్‌ని తమ సువర్ణహస్తాలతో విడుదల చేశారు సూపర్‌స్టార్‌ కృష్ణ. 
 
అనంతరం సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ "విఠలాచార్య గారి దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది 'ఇద్దరు మొనగాళ్లు'. ఆ సినిమా హిట్ అయ్యింది. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూశాను. కాంతారావు గారు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేశాను. జానపద నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువ. 'ఇద్దరు మొనగాళ్లు' కాకుండా 'మహాబలుడు', 'బొమ్మలు చెప్పిన కథ', 'సింహాసనం' సినిమాలు చేశాను. 'గూఢచారి 116' విడుదలైన 40 రోజులకు అనుకుంటా... 'ఇద్దరు మొనగాళ్లు' ఓకే చేశా. నేను చేసిన ఫస్ట్ మల్టీస్టారర్ కూడా ఇదే. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, స‌క్సెస్‌ఫుల్ నిర్మాతగా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. అనుకున్న బ‌డ్జెట్‌లో సినిమాలు తీసేవారు. ఒక దర్బార్ సెట్ వేస్తే... అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. ఆయన ఏ సినిమాకు అయినా ఒకటే సెట్ వేసేవారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వాహినీ స్టూడియోస్‌కు వచ్చేవారు. నా షూటింగులు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వ‌చ్చి కూర్చుని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు. బీఎన్ రెడ్డిగారు, చ‌క్ర‌పాణిగారు కూడా అలా సెట్స్‌కు వ‌చ్చి కూర్చునేవారు. విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది" అని అన్నారు. 
 
పులగం చిన్నారాయణ మాట్లాడుతూ "జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం 'జై విఠలాచార్య'. విఠలాచార్యగారు గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్‌ల‌లో వేగంగా, పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చనేది ఆయన ఆచరించి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్యగారి శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. విఠలాచార్యగారు సినిమాను ఎంత వేగంగా తీసేవారో, అంతే వేగంగా ఈ పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది" అని అన్నారు.
 
'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ "నేను పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూవీ వాల్యూమ్ పేరుతో ఒక వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్నాను. ఇప్పుడు పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను. 'జంధ్యా మారుతం', 'ఆనాటి ఆనవాళ్ళు', 'సినీ పూర్ణోదయం', 'స్వర్ణయుగపు సంగీత దర్శకులు', 'పసిడి తెర', 'సినిమా వెనుక స్టోరీలు', 'మాయాబజార్ మధుర స్మృతులు', 'వెండి చందమామలు'... ఇప్పటివరకూ పులగం చిన్నారాయణ ఎనిమిది పుస్తకాలు రాశారు. మూడు నందులు అందుకున్న సక్సెస్ ఫుల్‌ రైటర్‌ ఆయన.  
 పులగం చిన్నా రాయణగారు రాసిన తొమ్మిదో పుస్తకం 'జై విఠలాచార్యస‌ను మా తొలి పుస్తకంగా పబ్లిష్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం ముదావహం. సాధారణంగా సినిమాలకు ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేస్తుంటారు. ఓ బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. కొత్తగా ఉంటుందని చేశాం. మా ప్రయత్నానికి సహకరించి... కృష్ణగారితో లుక్ విడుదల చేయించిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుగారికి థాంక్స్. డిసెంబర్‌ నుంచి 'జై విఠలాచార్య'ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం" అని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 'అద్భుతం' స్ట్రీమింగ్