తెలుగు సినిమాలలో ఇలియానా కనిపించి ఆరేళ్లు గడిచిపోయాయి. 2005 సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా సుందరి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, నటిగా మంచి పేరు సంపాదించుకుంది. 2012లో రిలీజైన జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రాలతో తెలుగు సినిమాకు బై చెప్పి, హిందీలో సినిమాల్లో నటించింది. అక్కడ కూడా మంచి నటిగా నిరూపించుకున్నప్పటికీ సినిమా అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి.
అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలోనూ తన బాయ్‌ఫ్రెండ్ విషయంలో బాగా పాపులారిటీ వచ్చింది. అయితే తాజాగా ఇలియానా మళ్లీ తెలుగులో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న "అమర్ అక్బర్ ఆంటోనీ"(ట్రిపుల్ ఏ) చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. రవితేజ, ఇలియానా ఇద్దరూ రెండు చిత్రాల్లో కలిసి నటించారు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలవబోతోంది. పైగా రవితేజ - శ్రీనువైట్లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజైంది. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రంగస్థలం' సినిమా విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.