దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన "గంగోత్రి" సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. కేవలం అభిమానులు నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డ్ ను దక్కించుకుని ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.గంగోత్రి సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రెండవ సినిమా "ఆర్య" తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని యూత్ ను తనవైపు తిప్పుకున్నారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. తెలుగు సినిమాలలో అప్పటివరకు ఎవరు చెప్పని రీతిలో ఒక ప్రేమ కథను చూపించారు దర్శకుడు సుకుమార్. సుకుమార్ రాసిన "ఆర్య" పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. ఇప్పటికే కాదు అది ఎప్పటికి అల్లు అర్జున్ కెరియర్ లో ఆర్య సినిమాను ఒక క్లాసిక్ గా పరిగణించవచ్చు.ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు,ఇంత అందంగా ఒక కావ్యంలా చూపించొచ్చు అని వెండితెరపై గీసిన అద్భుతమైన చిత్రమే ఆర్య.
ఆర్య సినిమా తరువాత వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన "బన్నీ" మంచి కమర్షియల్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత చేసిన "హ్యాపీ" సినిమా కూడా ప్రేక్షకులకు హ్యాపీ అనిపించింది. ఆ తరువాత డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన "దేశముదురు" సినిమా అల్లు అర్జున్ లోని మరో అవతారాన్ని బయటకు తీసింది.
కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేశముదురు సినిమా అప్పట్లో ఒక సంచలనం.
ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన "పరుగు" సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి పరుగులు పెట్టించింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా వేదం, రుద్రమదేవి వంటి సినిమాలలో కూడా కీలకపాత్రలను పోషించారు అల్లు అర్జున్. వేదం సినిమాలోని కేబుల్ రాజు పాత్రలో ఎప్పటికి మర్చిపోలేని పెరఫార్మన్స్ ను ఇచ్చారు అల్లు అర్జున్. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం లాంటి వరుస హిట్ సినిమాలు కొట్టి ఇండస్ట్రీకి "సరైనోడు" అనిపించుకున్నారు.
త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాధ్ వంటి స్టార్ దర్శకులతో రిపీట్ హిట్స్ ను అందుకుని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు అల్లు అర్జున్. కేవలం తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా "పుష్ప" సినిమాతో తన కీర్తి ఖండాలు దాటింది. నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా గురించి ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది. నేటికీ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా 20 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ 20 ఏళ్ళ అల్లు అర్జున్ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి.