నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మహా నటుడు. మహా మనిషి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. నాకు నాగేశ్వరరావు గారితో వ్యక్తిగత పరిచయం ఉంది. నేను,ఆయన అనేక విషయాలపై మాట్లాడుకునే వాళ్లం. శ్రీ నాగేశ్వరరావు గారు జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకూ నటించిన నటుడు నాకు తెలిసి మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి నాగేశ్వరరావు గారు. అవతలి వాళ్ళు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సాంప్రదాయాలు, విలువలు ఆయన మనకి చూపించారు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనమిచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకుంటే అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఆయన చక్కని తెలుగు మాట్లాడేవారు.
వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. విలువలకు సజీవ దర్పణం ఏఎన్నార్ గారు. ప్రేమ అభిమానం వాత్సలంతో ఆయన తన పిల్లలని పెంచారు. ఈ రోజు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది. భాషనే కాదు వేషాన్ని కూడా సాంప్రదాయపద్దతుల్లో కాపాడుకుంటున్నారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని నేను ఎప్పుడూ చెబుతుంటాను.
నాగేశ్వరరావు గారు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే వారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. పాత్రకు సజీవ దర్పణంలా ఇమిడిపోయేవారు. నాగేశ్వరరావు గారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతివారు అందులో విద్యార్ధిలా ఆ గుణగణాలని అందిపుచ్చుకుంటే వారి జీవితాలనే మెరుగుపరుచుకోగలరు. నాగేశ్వరరావు గారి స్ఫూర్తిని పంచేలా ఈ విగ్రహం వుంది. నాగేశ్వరరావు గారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. వారు లేకపోయినా కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో నాగేశ్వరరావు గారు అగ్రగణ్యులు. నాగేశ్వరరావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు. నాగేశ్వరరావు గారు జీవితాన్ని చదివారు. జీవితంతో ఆయన పోరాటం చేశారు. దాన్ని ప్రేమించారు. ఆస్వాదించారు.
జీవితంలో తాను నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే అదే ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయనెప్పుడూ పోరాడి ఓడిపోలేదు. దీనికి కారణం ఆయన ఆత్మ విశ్వాసం, జీవిత విలువలు తెలుసుకోవడం. నేటి తరం కూడా వీటిని తెలుసుకోవాలి. ఆయన్ని నటుడిగా ఆరాధించడమే కాదు.. ఆయన జీవితం నుంచి స్ఫూర్తిపొందాల్సింది ఎంతో ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ముందుకుసాగారు. సాంఘిక పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయన అభినయం, వాచకం, ఆయన నృత్యాలు వేటికవే ప్రత్యేకం. ఆయన ప్రతి సినిమాలో సందేశం ఉండేది. అక్కినేని గారి స్ఫూర్తితో మంచి లక్షణాలను అలవరుచుకొని తర్వాత తరానికి కూడా నేర్పించాలి.
నేను సినిమా, వైద్యం, సేవా రంగాల్లో వారసత్వాన్ని ప్రోత్సహిస్తాను. ఇందులో వారసత్వం కష్టపడితే వస్తుంది. వారసత్వం కావాలంటే జవసత్వం వుండాలి. ఆ జవసత్వాలు గూర్చుకొని వారసత్వాన్ని అక్కినేని వారసులు నిలబెట్టడం చాలా సంతోషంగా వుంది. మహావ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.