Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

Advertiesment
Vijaydevarakonda, bhagya sri

దేవీ

, శుక్రవారం, 2 మే 2025 (18:54 IST)
Vijaydevarakonda, bhagya sri
'కింగ్‌డమ్' చిత్రం నుండి ఇటీవల విడుదలైన 'హృదయం లోపల' ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది. తాజాగా 'హృదయం లోపల' గీతం విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. 
 
అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో 'హృదయం లోపల' గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. వీరి మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్యరూపం ఇచ్చారు.
 
'హృదయం లోపల' గీతం విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్ కి కథానాయకుడు విజయ్ దేవరకొండ తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా భావాలను పంచుకున్నారు. "3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయాను. నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది." అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు.
 
కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా  'హృదయం లోపల' గీతం ఉంది. 'కింగ్‌డమ్' రూపంలో ఓ మంచి ఆల్బమ్ ని అందించబోతున్నట్లు తొలి గీతంతోనే ఈ త్రయం హామీ ఇచ్చింది.
 
వీడియో సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కథ లోతును తెలియజేస్తూ.. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తున్నారని విజువల్స్ ని బట్టి అర్థమవుతోంది.
 
జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ 'కింగ్‌డమ్'తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...