దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ దేశ ప్రజలతో పాటు.. ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య భయాందోళనను రేకెత్తిస్తోంది. మే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు మరింతగా ఆందోలన చెందుతున్నారు.
ఇదిలావుంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్న ఒక్క వార్తే ఇప్పుడు అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. అయితే కొందరిలో వ్యాక్సిన్‌పై అనుమానాలున్న నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
తాము వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ప్రపంచంతో పంచుకుంటూ వ్యాక్సిన్‌పై అపోహలను తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ట్వీట్ చేస్తూ.. “నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాను. దయచేసి మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి. కరోనా సెకండ్ వేవ్ అందరినీ చాలా బలంగా తాకుతోంది. దీనిని వ్యాక్సినేషన్‌తోనే అడ్డుకోగలం. 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హత ఉన్న వారందరూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు.