భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే.
కాగా, తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును అందుకునేందుకు తన కుటుంబ సభ్యులతో వెళ్లిన నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని అక్కడ గ్రూపు ఫోటో దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
మరోవైపు, కోలీవుడ్ అగ్ర నటుడు అజిత్ కుమార్ కూడా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. తాను పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. "ఈ శుభవార్త వినేందుకు తన తండ్రి జీవించి వుంటే బాగుందనిపిస్తుంది. ఆయన గర్వపడేవారు" అని పేర్కొన్నారు.