Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

Advertiesment
Director Kalyan Shankar

దేవీ

, సోమవారం, 31 మార్చి 2025 (14:26 IST)
Director Kalyan Shankar
జనాలలో ఈ మధ్య బాగా సీరియస్ నెస్ పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అందుకే జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ సినిమాలు చేస్తున్నాను. పైగా కామెడీ సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది అని 'మ్యాడ్ స్క్వేర్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ అన్నారు. 
 
 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
'మ్యాడ్'కి రెట్టింపు వినోదం 'మ్యాడ్ స్క్వేర్'తో అందిస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నాం అనుకుంటున్నారా?
ఖచ్చితంగా. స్వయంగా కొన్ని థియేటర్లకు వెళ్ళి చూశాం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాడ్ ఎక్కువగా యువతకి చేరువైంది. కానీ, మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. 
 
ఈ స్థాయి స్పందన ముందే ఊహించారా?
సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది కానీ, మ్యాడ్-1 ఫుల్ రన్ కలెక్షన్స్ ని మొదటి రోజే రాబట్టే స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు ఉన్నాయని అసలు ఊహించలేదు.
 
"పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి" అని ముందే చెప్పడం ఎంతవరకు ప్లస్ అయింది?
చాలా ప్లస్ అయింది. మన సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెబితే, ప్రేక్షకులకు అందుకు తగ్గ అంచనాలతోనే థియేటర్ కి వస్తారు. రాజమౌళి గారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెప్తుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది.
 
సెకండ్ హాఫ్ డల్ అయిందనే మాటలు కొన్ని వినిపించాయి కదా?
మొదటి షోకి కొందరు అలా అన్నారు కానీ, తర్వాత షోల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సునీల్ గారికి, మురళీధర్ గారికి మధ్య వచ్చే సన్నివేశాలను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఆంథోనీ క్యారెక్టర్ కి కూడా మంచి స్పందన లభిస్తోంది.
 
మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..?
మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ థియేటర్ లో సినిమా చూసి 15 ఏళ్ళు అవుతుంది. అలాంటావిడ మ్యాడ్ స్క్వేర్ టీజర్ చూసి, సినిమాకి తీసుకెళ్లమని అడిగారట. సినిమా చూస్తూ నవ్వినవ్వి కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్నారట. ఆ వయసు వాళ్ళు నా సినిమా చూసి, అంతలా నవ్వుకున్నామని చెప్పడాన్ని.. నేను బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను. 
 
నిర్మాత చినబాబు గారి గురించి?
చినబాబు గారు మొదటి నుంచి మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. రైటింగ్, షూటింగ్ విషయంలో ఆయన ఎన్నో సూచనలు ఇచ్చారు.
 
ఎడిటర్ నవీన్ నూలి గారి గురించి?
ఈ సినిమా ఇంత బాగా రావడంలో ఎడిటర్ నవీన్ నూలి గారి పాత్ర ఎంతో ఉంది. సినిమా అంతా తీయడం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేయడం కాకుండా, షూటింగ్ దశ నుంచి మాతో ట్రావెల్ అయ్యారు. ప్రతి షెడ్యూల్ కి ముందు ఆయనతో చర్చించి, క్రిస్ప్ రన్ టైం వచ్చేలా చేశాము.
 
ఓవర్సీస్ 1 మిలియన్ కలెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా ఉందండి. 1 మిలియన్ అనేది పెద్ద విషయం కదా. అలాంటిది తక్కువ టైంలోనే ఆ మార్క్ ని అందుకోవడం ఆనందంగా ఉంది.
 
రవితేజ గారితో సూపర్ హీరో సినిమా చేయబోతున్నారు కదా. దానిలో కూడా కామెడీ ఉంటుందా?
ఖచ్చితంగా కామెడీ ఉంటుంది. అలాగే సినిమా కొత్తగా ఉంటుంది. సూపర్ హీరోకి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. పూర్తిగా ఫిక్షన్.
 
మీ బలం ఏంటి?
కామెడీ అయినా ఎమోషన్ అయినా ఊహించనివిధంగా రావాలి. అలా తీసుకురావడమే నా బలం అని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది జరుగుతుందని అందరూ అనుకున్నప్పుడు, అది జరగకూడదు. కానీ, అది కన్విన్సింగ్ ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం