విజయ్ దేవరకొండ యూత్‌లో తనకున్న క్రేజ్‌ని క్యాచ్ చేసుకుంటూ ‘రౌడీ’ పేరుతో వస్త్ర బ్రాండ్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చాడు. ఈ బ్రాండ్ కూడా యువ మనసులను దోచుకుంది. దీంతో విజయ్‌పై తమ అభిమానాన్ని చాటుకునేలా కొందరు రౌడీ అనే పేరును తమ తమ వాహనాలపై ముద్రించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ‘రౌడీ’ అనేది విజయ్ అభిమానులకు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అయితే... ఈ బ్రాండ్ నేమ్‌ను వారు ఎక్కడ బడితే అక్కడ రాసేసుకోవడమే తలనొప్పిగా తయారైంది.
వివరాలలోకి వెళ్తే... ఓ కుర్రాడు తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నంబర్ ప్లేటుపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా కేవలం ‘రౌడీ’ అని మాత్రమే వ్రాసి ఉండడంతో పట్టుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా వ్రాసి... అక్కడితో ఆగకుండా ఆ బైక్ ఫొటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ పెట్టారు.
దీనిపై విజయ్ దేవరకొండ హుందాగా స్పందిస్తూ... ఆ కుర్రాళ్ల బదులు తాను క్షమాపణలు చెప్తూన్నానంటూ ట్వీట్ చేసారు. తక్షణమే దీనిపై అందరిలోనూ చైతన్యం కలిగిస్తానని పేర్కొంటూ... తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని పంపుతూ... ‘నా ప్రియాతిప్రియమైన అందరికీ, మీరు రౌడీ అని రాసుకోవడాన్ని నేను చూస్తే, వెంటనే మనమంతా ఒక కుటుంబం అని భావిస్తాను.
అందుకే మన కుటుంబ సభ్యులందరికీ ఒక మాట చెబుతున్నాను, సమస్యల్లో చిక్కుకోకండి. కొన్ని నిబంధనలను మనం అనుసరించాలి. అవన్నీ మన మంచి కోసమే. నేను కూడా వాటిని అనుసరిస్తాను. మీ ప్రేమను ఎవరిమీదైనా చూపించుకోండి (కుటుంబం/స్నేహితుడు/దేవుడు), మీ బైక్‌లోని ఏ ఇతర పార్ట్ మీదైనా చూపించుకోండి. కానీ నంబర్ ప్లేట్‌ని మాత్రం కేవలం నంబర్లకే వదిలేయండి. మీ రౌడీ కామ్రేడ్, విజయ్ దేవరకొండ’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే..
కాగా... యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ఈ ట్వీట్‌పై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించారు. ‘‘నువ్వు ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రియల్ హీరోవే. మీ సామాజిక స్పృహను నేను అభినందిస్తున్నాను’ అని ట్విటర్ ద్వారా అభినందించారు.