Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి

బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. శివలింగాన్నే అమాంతంగా పెకిలించి భుజంమీదికెత్తుకు

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి
హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (02:40 IST)
బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట  ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. శివలింగాన్నే అమాంతంగా పెకిలించి భుజంమీదికెత్తుకుని బాహుబలి ప్రభాస్ నదిలోకి మోసుకెళుతుంటే... గిరిజనులు ఊపిరి తీయడం కూడా మర్చిపోయి చేతులెత్తి మొక్కుతుంటే, ఆ సినిమాలో సాధువుగా కనిపించిన తనికెళ్ల భరణి శివలింగం అమాంతం ఎత్తుకొని ప్రభాస్‌ భుజాన పెట్టుకున్నప్పుడు సమ్మోహితుడై అవాక్కయి వెన్నంటి నడుస్తుంటే.. సినిమా విజయాన్ని అక్కడే ఖాయం చేసిన అద్వితీయ దృశ్యం, అద్వితీయ సంగీతం, అద్వితీయ మూర్తిత్వం ఆ పాటలోనే మనకు కనిపిస్తుంది. ఆధునిక తెలుగు సినిమా పాటల్లో ఆణిముత్యంగా నిలిచిన ఈ గొప్ప పాటను అంత సులభంగా మర్చిపోవడం కష్టం. మానవ భావోద్వేగాలను పరాకాష్టకు తీసుకుపోయిన ఈ మహత్తర గీతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే. ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తవా మరి. 
 
సరిగ్గా అలాగే ప్రత్యర్థులకు చమట పుట్టిస్తున్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత హరీస్ రావత్. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను తమ బుట్టలో వేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాలకు కూడా దిగుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి విజయం దక్కుతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ మహత్యమో లేక ప్రధాని మోదీకి ధీటుగా తామేం ప్రచారంలో తక్కువకాదని నిరూపించుకునే ప్రయత్నమో కానీ...  మొత్తానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ బాహుబలి అవతారం ఎత్తారు.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాహుబలి ఎంతటి క్రేజ్‌ సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ అనే పాట మేకింగ్‌ ఎప్పటికీ వండర్‌. సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. ఈ గీతం బ్యాక్‌ గ్రౌండ్‌తోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి హరీశ్‌ రావత్‌ కావడం విశేషం. దీన్ని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ సిద్ధం చేసి విడుదల చేయగా హరీశ్‌ రావత్‌ తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షేర్‌ చేశారు.

ఈ వీడియో జనాలను కనురెప్పవేయనివ్వడం లేదంటే నమ్మండి. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఉత్తరాఖండ్‌ పోరాట యోధుడు హరీశ్‌ రావత్‌ అని టైటిల్‌ పడుతుండగా పాట మొదలవుతుంది. అక్కడి ప్రసిద్ధమైన ప్రాంతాల చిత్రాలు వేగంగా వచ్చి వెళతాయి.
 
అనంతరం బాహుబలిగా హరీశ్‌ రావత్‌ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్‌ శివలింగాన్ని ఎలా ఎత్తుకుంటాడో అతడిని మించిన స్థాయిలో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ హరీశ్‌ కూడా ఉత్తరాఖండ్‌ భాగాన్ని తన భుజాలకు ఎత్తుకుంటాడు. అది చూసి అమిత్‌ షా అవాక్కవుతాడు.

కొసమెరుపేంటంటే ఒరిజినల్‌ బాహుబలిలో సాధువుగా కనిపించిన తనికెళ్ల భరణి ప్రభాస్‌ శివలింగం అమాంతం ఎత్తుకొని భుజాన పెట్టుకున్నప్పుడు ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో ఆయన స్థానంలో ప్రధాని మోదీ కనిపిస్తూ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఒక్క ముఖాలను ఎడిట్‌ చేసి రూపొందించిన ఈ వీడియో చూపరులను కట్టిపడేస్తోంది.
 
ఆహార్యంలో, అభినయంలో బాహుబలి ముఖాన్ని ఎడిట్ చేసి రూపొందించిన ఈ వీడియో ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం కలిగిస్తోంది. బాహుబలిని ఇలా వాడుకోవచ్చని సృజనాత్మకంగా ఊహించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ఒక్క వీడియోతోనే అఖండ ప్రచారం సంపాదించేశారు.

బాహుబలి రూపంలోని హరీష్ రావత్‌ను చూసి షాకవుతున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను, తనికెళ్ల భరణి స్థానంలో బాహుబలిని చూస్తూ సమ్మోహితుడవుతున్న ప్రధాని మోదీని వీడియోలో చూస్తుంటే జనం కడుపుబ్బ నవ్వుతున్నారంటే ఈ వీడియో కలిగించిన ప్రభావం అర్థం చేసుకోవచ్చు. 
 
ఇంతకూ ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, అభినవ బాహుబలికి ఓట్లు పడతాయో లేవో తర్వాతి విషయం. కానీ ఎవ్వరంట ఎవ్వరంటా నిన్ను ఎత్తుకుంది అనే ఆ మనోహరమైన పాటను ఇంత తెలివిగా వాడుకోవచ్చని ఊహించిన ఆ క్రియేటివ్ జీనియస్ ఎవరో కానీ వారికి వీరతాడు వేయల్సిందే మరి. 

ఒక వైపు ప్రజలు సమస్యలతో చస్తుంటే వాటి పరిష్కారాలకు తామేం చేస్తామో చెప్పకుండా ఇలాంటి చీఫ్ పాలిట్రిక్స్‌కు పరుగులెత్తడం ఏమిటి  అంటూ విమర్శల దాడి ఇప్పటికే మొదలైపోయిందనుకోండి. కానీ... 
 
ఈ అభినవ బాహుబలిని అద్బుతంగా చూపిస్తున్న ఆ వీడియోను యూట్యూబ్‌లో చూడకపోతే ఒక సృజనాత్మక కల్పనను మీరు మిస్సవుతున్నట్లే. 

Bahubali 2 Harish Rawat Uttarakhand Elections 2017 Viral Video Funny Video
https://www.youtube.com/watch?v=RwNI77PhYxk
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాథీరాం బాబాగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు: నిర్మాత ఎ. మహేష్‌ రెడ్డి