విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా ట్రైలర్ విడుదల ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ కు రెడీ అవుతోంది.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. తెలిస్తే పాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకునేవాడిని. ఇప్పుడు బిజీగా మారా. నేర్చుకునే టైమ్ దొరకడం లేదు. ఖుషి హాఫ్ పార్ట్ షూట్ చేసే టైమ్ కు సమంతకు హెల్త్ బాగాలేదు. ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్ చేద్దామని అనుకున్నాం. సమంత కోలుకుంటే చాలనుకున్నాం. ఒకవేళ తను క్యూర్ అయ్యేందుకు పదేళ్లు పట్టినా..ఈ కథను మరోలా మార్చి ..పదేళ్ల తర్వాత సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమాకు సమంత చేసిన కాంట్రిబ్యూషన్ మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ఆమె వచ్చి సినిమా పూర్తి చేసింది. యాక్షన్ సినిమాలనే పాన్ ఇండియా కోసం ఎంచుకుంటారు. కానీ ఈ సినిమా మేము వివిధ రాష్ట్రాల్లో బాక్సాఫీస్ నెంబర్స్ చూపించేందుకు చేసింది కాదు. లవ్ అనేది అందరి లైఫ్ లో ఒకటే. ఆ రూటెడ్ లవ్ స్టోరిని పాన్ ఇండియా వైజ్ చూపించాలని అనుకున్నాం. అని చెప్పారు.
మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ - ఖుషి ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ..ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మా హీరోయిన్ సమంత ఇక్కడికి ఇవాళ రాలేకపోయింది. దర్శకుడు శివ నిర్వాణ హార్ట్ అండ్ సోల్ తో ఈ సినిమాను రూపొందించారు. ఆయన కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వెంటనే మేము మూవీని స్టార్ట్ చేశాం. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ మా సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 1న ఒక మంచి లవ్ స్టోరిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.
డీవోపీ జి.మురళి మాట్లాడుతూ - అందాల రాక్షసి తర్వాత నేను చేసిన రెండో తెలుగు సినిమా ఖుషి. ఇదొక క్యూట్ లవబుల్ ఫిల్మ్. ఈ సినిమా చూశాక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. దర్శకుడు శివ గారితో పనిచేయడం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు థాంక్స్. రవి గారు, చెర్రీ గారు నన్ను ఒక బ్రదర్ లా చూసుకుంటారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాలకు పనిచేయాలని అనుకుంటున్నాను. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ - మంచి మ్యూజిక్ చేయాలి. ఆ మ్యూజిక్ అందరికీ రీచ్ అవ్వాలని అనుకుంటున్న టైమ్ లో ఖుషి సినిమాకు పనిచేసే అవకాశం దక్కింది. ఒక రోజు మైత్రీ నుంచి కాల్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వచ్చి కథ వినగానే ఒక ఎమోషన్ లోకి వెళ్లిపోయాను. ఈ సినిమాకు ఎప్పటికీ గుర్తుండే మ్యూజిక్ ఇచ్చేందుకు నేను డైరెక్టర్ శివ గారు ఎంతో కష్టపడ్డాం. రెండేళ్లపాటు ఈ సినిమా కోసం ట్రావెల్ చేశాం. ఇవాళ ఖుషి పాటలను మ్యూజిక్ లవర్స్ ఒక సెలబ్రేషన్ లా జరుపుకుంటున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కు వస్తున్న పేరు నా ఒక్కడిది కాదు మొత్తం టీమ్ ది. అని అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - ఖుషి సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థాంక్స్. దర్శకుడు శివ, హీరో విజయ్ మా సంస్థలో ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. పాటలు ఎంతబాగున్నాయో మీరు విన్నారు. సెప్టెంబర్ 1న ఖుషి సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆగస్టు 15న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తాం. ఖుషిని ఇంత అందంగా తీర్చిదిద్దిన మా టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ఖుషితో రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఈ క్రమంలో ఎన్నో ఎమోషన్స్ కు గురయ్యాను. దేశంలోని అనేక అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. మధ్యలో సినిమా షూటింగ్ ఒకసారి ఆగిపోయింది. ఈ మొత్తం జర్నీలో నాకు ఏ ఇబ్బందీ రానిది నా టీమ్ తోనే. అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరో విజయ్ వరకు అందరూ సపోర్ట్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ అంటే విపరీతమైన లవ్ ఏర్పడింది. అదంతా ఈ సినిమాలో చూపించాను. ట్రైలర్ లో ఆ లవ్ కొంత చూసి ఉంటారు. సమంత నా అభిమాన నటి. ఆమె కథను, క్యారెక్టర్ ను అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఇది నా నాలుగో సినిమా. మజిలీ తర్వాత నేను థియేటర్ ద్వారా ప్రేక్షకుల్ని కలుసుకోలేదు. ఆ వెలితి నాలో చాలా ఉండిపోయింది. ఈ సినిమాతో ప్రేక్షకులపై నాకున్న ప్రేమను చూపించబోతున్నా. లవ్ అండ్ సెలబ్రేషన్ ఈ రెండు ఖుషి సినిమాలో ఉంటాయి. మణిరత్నం సార్ సినిమాలు నాకు చాలా ఇష్టం. కాశ్మీర్ వెళ్లిన ప్రతిసారీ ఆయనే గుర్తుకు వస్తారు. అన్నారు.