Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

shyam benegal

ఠాగూర్

, సోమవారం, 23 డిశెంబరు 2024 (21:43 IST)
ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఇకలేరు. ఆయన వయసు 90 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
 
శ్యామ్‌ బెనెగల్‌కు భార్య నీరా బెనెగల్‌, కుమార్తె పియా బెనెగల్‌ ఉన్నారు. ఇటీవలే 90వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన.. రెండు, మూడు ప్రాజెక్టులు చేస్తున్నట్లు ఆ సందర్భంలో వెల్లడించారు. అయితే, కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించారు.
 
శ్యామ్‌ బెనెగల్‌గా ప్రఖ్యాతిగాంచిన బెనగళ్ల శ్యామ్‌ సుందరరావు హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో 1934 డిసెంబర్‌ 14న జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్‌ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నారు. చిన్నప్పట్నుంచే సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్న శ్యామ్‌ బెనెగల్‌.. 1959లో ముంబైలో ఓ యాడ్‌ ఏజెన్సీలో కాపీరైటర్‌గా పనిచేశారు. మరో సంస్థలో క్రియేటివ్‌ హెడ్‌గా కొనసాగారు. 
 
1962లో తొలి డాక్యుమెంటరీ (గుజరాతీ) రూపొందించారు. దశాబ్దం తర్వాత ఫీచర్‌ ఫిల్మ్‌ను ఆయన తెరకెక్కించారు. అలా.. సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప చిత్రాలు తీయడం ద్వారా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. సినీ రంగంలో తన అపూర్వ సేవలకుగాను 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్‌, 2003లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు, ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు వరించాయి. 
 
అనంత్‌ నాగ్‌, షబానా అజ్మీ ప్రధాన పాత్రలో రూపొందిన 'అంకుర్‌' చిత్రం సెకండ్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో జాతీయ అవార్డును అందుకుంది. 'నిషాంత్‌', 'మంథన్‌', 'భూమిక', 'సమర్‌', 'హరి- భరీ', 'మండి'.. ఇలా బెనెగల్‌ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలూ అవార్డులు దక్కించుకోవడం విశేషం. 
 
ఆయన డైరెక్షన్‌లో వచ్చిన చివరి చిత్రం 'ముజిబ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌' గతేడాది విడుదలైంది. పలు లఘు చిత్రాలు, ధారా వాహికలకూ బెనెగల్‌ దర్శకత్వం వహించి తనదైన ముద్ర వేశారు. ఈ లెజెండరీ దర్శకుడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?