Fedaration leaders, cine Karmikulu
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక వూడిపోయిందనే పాత సామెత గుర్తుకొస్తోంది! తెలుగు సినిమా కార్మికుల ఫెడరేషన్ ఏకఛత్రాధిపత్యం గా మూర్ఖంగా కుట్రపూరితంతో తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది! కార్మికులను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన ఫెడరేషన్ నేతలకు వీసమెత్తు నష్టం కూడా లేదు! కానీ, ఏ పూటకు ఆపూట గడిపే కార్మికులకే ఇబ్బందులు! స్వార్ధపూరిత నాయకులను నమ్ముకున్నందుకు నట్టేట మునిగినట్లు అయ్యింది! అసలుకే ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.
నిజానికి పేదల పక్షాన కార్మికుల పక్షాన నేను మాట్లాడాలి, నిలబడాలి! కానీ, సినిమా కార్మికుల విషయంలో ఆమాత్రం జాలి కలగడం లేదు! ఆవేదన అనిపించడం లేదు! ఎందుకంటే చిత్రపురి కాలనీ సిత్రాలే వేరు! విమర్శించడం, ఎద్దేవా చేయడం కాదు కానీ, విషపూరిత కుట్రపూరిత దోచుకునే నేతలను నమ్మి గుడ్డిగా పెంచి పోషించిన కార్మికులదే తప్పు! జై కొడితే పని ఇస్తారని గుడ్డెద్దు చేలో పడినట్లు మద్దతు పలకడం పెద్ద తప్పు! నాయకులు మాఫియాగా మారడానికి, తప్పులపై తప్పులు చేస్తూ కోట్లు దోచుకోవడానికి కార్మికుల ఏమాత్రం పట్టని నిర్లక్ష్యతనమే ప్రధాన కారణం! గత కొన్నేళ్లుగా కార్మికులను అడ్డు పెట్టుకుని నేతలు చెలరేగిపోయారు! ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరుకుని తమాషా చూస్తున్నారు!
సినీ కార్మికులు అంటే ఇందులో లైట్ బోయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు, మేకప్ ఆర్టిస్ట్ నుంచి కాస్ట్యూమ్ హెల్పర్ వరకు, డ్రైవర్ నుంచి క్రెన్ ఆపరేటర్ వరకు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సినిమాటోగ్రాఫర్, జూనియర్ ఆర్థిస్టుల వరకు అందరూ ఉంటారు! ఇప్పటి వరకు 24 క్రాఫ్ట్స్ యూనియన్ల లో సభ్యత్వం ఉన్నవారికే పని దొరికేది! అందులో ఆయా యూనియన్ల సభ్యత్వ కార్డు దొరకడానికి పెద్ద మొత్తం చెల్లించాలి! పని దొరికాక రోజువారీ వేతనాల్లోంచి కొంత ఆమ్యామ్యా చెల్లించుకోవాలి!
ఉదయం 5 గంటలకే సిద్ధంగా ఉండాలి! సాయంత్రం 6.20 గంటల వరకు డ్యూటీ చేయాలి! ఆతరువాత కూడా షూటింగ్ కొనసాగితే నిర్మాత అదనపు భత్యం సమర్పించుకోవాలి! ఇక టిఫిన్లు, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీలు, కాఫీలు అన్నీ షరా మామూలే! అడ్డా మీద కూలీకి సినీ కార్మికులకు చాలా తేడా ఉంది! అడ్డా కూలీ తన క్యారియర్ తను తెచ్చుకుంటాడు! లంచ్ బ్రేక్ మినహా ఇంకే బ్రేక్ ఉండదు! వేతనం కూడా 800 నుంచి 1200 లోపు ఉంటుంది! సినీ కార్మికులది అలా కాదు! ఫుడ్, మధ్య మధ్య బ్రేకులు, వేతనం కూడా వెయ్యి నుంచి పది వేల వరకు వారి వారి స్థాయి నైపుణ్యం బట్టి మారిపోతూ ఉంటుంది! అంతటి గుర్తింపు ఉన్న సినీ కార్మికులను అడ్డు పెట్టుకుని యూనియన్లు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు! ఒక పెద్ద నవల రాసేయవచ్చు!
సినీ రంగం మిగిలిన రంగాలకు భిన్నం! సినిమాకు కీలకం నిర్మాత మాత్రమే! నిర్మాత లేనిదే సినిమా లేదు! హీరో కాల్ షీట్ దొరికి కోట్లు సమర్పించుకుని మంచి దర్శకుడిని ఎంపిక చేసుకుని కథ సిద్ధం చేసుకుని సంగీతం సమకూర్చుకుని షూటింగ్ కు సిద్ధం అయితేనే కార్మికులకు పని దొరుకుతుంది! కానీ, యూనియన్లు అడ్డదిడ్డ నిర్ణయాలతో చాలాసార్లు నిర్మాతలు ఇబ్బంది పడుతూ అదనంగా ఖర్చులు పెంచుకుంటూ నష్టాలకు గురవుతుంటారు! సంవత్సరానికి 10 శాతం లెక్కన ప్రతి మూడేళ్లకు 30 శాతం వేతనం కార్మికులకు పెంచాలనే ఫెడరేషన్ నిబంధన నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది! యూనియన్లకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏర్పరస్తుంది! సమ్మెకు వెళ్లాలంటే ముందస్తుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది! అవేమి పాటించకుండా రాత్రికి రాత్రి సమ్మెకు ఫెడరేషన్ పిలుపు ఇవ్వడంతో చాలా షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయాయి! దాంతో నిర్మాతలకు చుర్రుమని కాలింది! చర్చలు జరుగుతున్న వేళ ఇలా సమ్మెకు పిలుపునిచ్చి నష్టం కలిగించిన కోపం ఆవేదనలోంచి నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది! కార్మిక శాఖ కార్యదర్శితో చర్చించి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇక యూనియన్లతో సంబంధం లేదని, నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని ప్రకటించింది.
ఈ నిర్ణయం పట్ల కార్మికుల్లో అధిక శాతం హర్షం వెలిబుచ్చారు! కానీ నేతలకు భయపడి బయట పడటం లేదు! నిజానికి ఈ సమ్మె వెనుక పెద్ద కుట్ర కోణం కనిపిస్తోంది! కార్మికులను అడ్డు పెట్టి చిత్రపురి మాఫియా ఆధిపత్యం పెంచుకునే ధోరణిలో అసలుకే మోసం ఎదురయినట్లు కొందరు సినీ పండితులు అంటున్నారు! ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ లో ముదురు నేతలు కొందరు చేసిన కుట్ర ఫలితమే కార్మికులకు ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది! చిత్రపురి కాలనీలో భారీ టవర్లకు అనుమతి తెచ్చుకున్నారు! ఎన్నికలు లేకుండా ఆయా యూనియన్లలో కొనసాగుతున్న దోపిడీ నేతలు మరింత దోచుకోవడానికి, తమ అధిపత్యాన్ని చాటుకునేందుకు వేసిన ఎత్తుగడల్లో ఇప్పుడు బొక్కా బోర్లాపడ్డారు! ఇప్పటికైనా ఆయా పదవులకు రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు! ఈ చిత్రపురి సిత్రాలు ఇంకే విధంగా రూపుదాలుస్తాయో వేచి చూడాల్సిందే.