Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడికి మొక్కుకున్న మేక కథ తో దీపావళి - రామ్ పోతినేని విడుదల చేసిన ట్రైలర్

depavali
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:57 IST)
depavali
అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే... దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే 'దీపావళి' సినిమా చూడాలి.

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'దీపావళి'. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'కు తెలుగు అనువాదం ఈ 'దీపావళి'. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉస్తాద్ రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు.

పల్లెటూరి నేపథ్యంలో 'దీపావళి' తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే... పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఆవిష్కరించారు. తాత, మనవడు, మేక మధ్య బంధాన్ని బలంగా చూపించారు. దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు.  మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు. అయితే... కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేక కొనడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేది వెండితెరపై చూడాలి. మేకకు ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు సప్తగిరి వాయిస్ ఇచ్చారు.

చిత్ర నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేటివిటీకి పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. ప్రతి ఫ్రేములో సహజత్వం కనపడుతుంది. తాతయ్య, మనవడు, మేక మధ్య అనుబంధం... వాళ్ళ భావోద్వేగం... ప్రేక్షకులందరి హృదయాలను కదిలిస్తుంది. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులను మన్ననలు అందుకునే చిత్రమిది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ పాటలు విడుదల చేస్తాం'' అని చెప్పారు.

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, సమర్పణ : కృష్ణ చైతన్య, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ సర్కారును ఎంటర్‌టైన్ చేస్తున్న కంగనా.. స్వామి కామెంట్స్..